Shwan Singh: ఎవరీ శ్వాన్ సింగ్... చదువుల ఖర్చు భరించేందుకు నిర్ణయించిన భారత సైన్యం!

Shwan Singh Education Sponsored by Indian Army
  • ఆపరేషన్ సిందూర్ సమయంలో సైనికులకు తోడుగా నిలిచిన శ్వాన్ సింగ్
  • మంచినీళ్లు, చాయ్, పాలతో పాటు లస్సీ వంటివి అందించిన శ్వాన్ సింగ్
  • శ్వాన్ సింగ్‌ను సత్కరించిన వెస్ట్రన్ కమాండ్ జీవోసీ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ 
పదేళ్ల వయసున్న శ్వాన్ సింగ్ అనే బాలుడి చదువుకు అయ్యే ఖర్చులను పూర్తిగా భరించేందుకు సైన్యంలోని గోల్డెన్ యారో డివిజన్ ముందుకు వచ్చింది. భారత సైన్యం ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఆ బాలుడు సైన్యానికి అందించిన సేవలే.

పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్ తారావాలీ గ్రామం అంతర్జాతీయ సరిహద్దుకు దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో అక్కడ భారీ సంఖ్యలో బలగాలను మోహరించారు. శత్రుదేశంతో భారత సైన్యం తలపడుతున్న సమయంలో ఆ గ్రామానికి చెందిన శ్వాన్ సింగ్ (10) అనే బాలుడు సైనికులకు అండగా నిలిచాడు. మంచినీళ్లు, చాయ్, పాలతో పాటు లస్సీ వంటివి అందిస్తూ సైన్యానికి తన వంతు సహాయం చేశాడు. ఈ క్రమంలో బాలుడి సేవలను సైనికాధికారులు ప్రశంసించారు. తాజాగా అతడి చదువుకు అయ్యే ఖర్చులను భరించేందుకు ముందుకు వచ్చారు.

ఫిరోజ్‌పుర్ కంటోన్మెంట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వెస్ట్రన్ కమాండ్ జీవోసీ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ ఈ బాలుడిని సత్కరించారు. దేశవ్యాప్తంగా ఇటువంటి వీరులకు సరైన గుర్తింపు, తోడ్పాటు లభించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. 
Shwan Singh
Indian Army
Golden Arrow Division
Ferozepur
Punjab
Operation Sindoor
International Border
Manoj Kumar Katiyar
Western Command
Military Support

More Telugu News