Namburi Seshagiri Rao: నాడు పోలింగ్ బూత్ లో పిన్నెల్లిని ఎదుర్కొన్న టీడీపీ కార్యకర్త నంబూరి శేషగిరిరావు మృతి... చంద్రబాబు, లోకేశ్ స్పందన

Namburi Seshagiri Rao TDP Leader Dies Chandrababu Lokesh Respond
  • గత ఎన్నికల వేళ ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లి
  • ఆయన పైకి దూసుకెళ్లిన నంబూరి శేషగిరిరావు
  • తాజాగా గుండెపోటుతో నంబూరి మృతి
  • పార్టీ అండగా ఉంటుందన్న చంద్రబాబు, లోకేశ్
ఏపీలో గత ఎన్నికల వేళ పోలింగ్ ఎంత హోరాహోరీగా సాగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మాచర్ల నియోజకవర్గంలో పాల్వాయిగేట్ పోలింగ్ బూత్ లో అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేస్తుంటే టీడీపీ కార్యకర్త నంబూరి శేషగిరిరావు ధైర్యంగా ఎదుర్కోవడం సంచలనం సృష్టించింది. అయితే, విచారకరమైన విషయం ఏమిటంటే... నంబూరి శేషగిరిరావు గుండెపోటుతో మరణించారు. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియాలో స్పందించారు

యోధుడిని కోల్పోవడం బాధగా ఉంది: చంద్రబాబు

మాచర్ల నియోజకవర్గం, పాల్వాయిగేట్‌ గ్రామానికి చెందిన టీడీపీ నేత నంబూరి శేషగిరిరావు గుండెపోటుతో మృతి చెందడం విచారకరం అని చంద్రబాబు తెలిపారు. నాడు ప్రతిపక్షంలో వైసీపీ అరాచకాలపై తిరుగుబాటు చేసి వీరోచితంగా పోరాడిన యోధుడిని కోల్పోవడం బాధగా ఉందన్నారు. పసుపుజెండా చేతబట్టి రౌడీ, ఫ్యాక్షన్ రాజకీయ నాయకులపై శేషగిరిరావు చేసిన తిరుగుబాటు తెలుగుదేశం పార్టీకి స్ఫూర్తిగా నిలిచిందని, శేషగిరిరావు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. 

దిగ్భ్రాంతికి గురయ్యాను: నారా లోకేశ్

మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయిగేటు గ్రామానికి చెందిన టీడీపీ నేత నంబూరి శేషగిరి రావు మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. "2024 సాధారణ ఎన్నికల సమయంలో పాల్వాయిగేట్ లోని ఓ బూత్ లో వైసీపీ నేతలు సాగించిన విధ్వంసం పట్ల ఆయన ఎదురొడ్డి నిలిచారు. శేషగిరి రావు పోరాటం టీడీపీ నేతలు, కార్యకర్తల్లో ఎంతో స్ఫూర్తి నింపింది. ఆయన మరణం పార్టీకి తీరనిలోటు. శేషగిరిరావు కుటుంబానికి పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుంది. ఆయన మృతి పట్ల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని వివరించారు. 

నంబూరి మృతిపై ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కూడా విచారం వ్యక్తం చేశారు. నాడు ప్రతిపక్షంలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకుల అరాచకాలపై ధైర్యంగా తిరగబడి, వీరోచితంగా పోరాడిన ఒక యోధుడిని కోల్పోవడం ఎంతో బాధాకరం అని పేర్కొన్నారు. పసుపు జెండా చేతబట్టి వైసీపీ రౌడీ, ఫ్యాక్షన్ రాజకీయ నాయకులపై శేషగిరిరావు చేసిన తిరుగుబాటు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు, నాయకుడికి ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు. ఈ మేరకు నాడు పోలింగ్ బూత్ లో నంబూరి శేషగిరిరావు వీరోచితంగా పోరాడిన వీడియోను కూడా మంత్రి గొట్టపాటి పంచుకున్నారు.
Namburi Seshagiri Rao
Chandrababu Naidu
Nara Lokesh
TDP
AP Elections 2024
Macharla
Palvai Gate
Pinelli Ramakrishna Reddy
Heart Attack
Andhra Pradesh Politics

More Telugu News