Viral Video: వడోదరలో రద్దీ రోడ్డుపైకి ఎనిమిది అడుగుల భారీ మొసలి.. ఇదిగో వైర‌ల్‌ వీడియో!

Vadodara Crocodile Spotted on Busy Road in Viral Video
  • రద్దీ రోడ్డుపైకి ఉన్నట్టుండి ప్ర‌త్య‌క్ష‌మైన 8 అడుగుల మొస‌లి
  • దాన్ని చూసేందుకు జ‌నం ఎగ‌బ‌డ‌డంతో భారీగా ట్రాఫిక్ జామ్
  • ఈ ఘ‌ట‌న తాలూకు వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్
రద్దీ రోడ్డుపైకి ఉన్నట్టుండి ఏకంగా ఎనిమిది అడుగుల భారీ మొసలి ప్ర‌త్య‌క్ష‌మైంది. దాంతో ఆ మొసలిని చూసేందుకు జనం ఎగ‌బ‌డ్డారు. దాంతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. గుజరాత్‌లోని వడోదరలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 

వడోదరలో నర్హరి విశ్వామిత్రి నది సమీపంలోని నర్హహరి విశ్వామిత్రి బ్రిడ్జి రోడ్డులో శుక్రవారం రాత్రి ఓ భారీ మొసలి ద‌ర్శ‌న‌మిచ్చింది. ఎనిమిది అడుగుల మొసలి రోడ్డుపై కనిపించడంతో అటుగా ప్రయాణించేవాళ్లు నిర్ఘాంత‌పోయారు. భారీ ఆ మొసలిని తమ ఫోన్ల‌లో బంధించేందుకు పోటీపడ్డారు. దాంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్‌ జామ్ ఏర్ప‌డింది. 

కమిషనర్‌ బంగ్లాకు సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. జనం తన చుట్టూ గుమిగూడటంతో భయపడిన మొసలి ముందుగా కదలకుండా ఉండిపోయింది. ఆ తర్వాత తప్పించుకునేందుకు ఒక్కసారిగా జనంవైపు దూసుకెళ్లింది. స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనాస్థలికి వచ్చి, మొసలిని ప‌ట్టుకెళ్లారు. 

ఆ త‌ర్వాత దాన్ని విశ్వామిత్రి నదిలో వదిలేశారు. కాగా, ఆ నదిలోని 17 కిలోమీటర్ల పరిధిలో మొత్తం 300కు పైగా మొసళ్లు ఉన్నాయని అధికారులు చెప్పారు. భారీ వర్షాల వల్ల నదులు ఉప్పొంగడంతో మొసళ్లు దారితప్పి జనావాసాల్లోకి వస్తున్నాయని పేర్కొన్నారు.
Viral Video
Vadodara Crocodile
Crocodile
Vadodara
Vishwamitri River
Gujarat
Traffic Jam
Crocodile Rescue

More Telugu News