Nallabothula Gopal: భార్యను చంపి అడవిలో పడేసి... పోలీసులకు లొంగిపోయాడు!

Kadapa Man Surrenders After Killing Wife Over Affair
  • పెద్ద మనుషుల పంచాయతీలో మందలించినా తీరు మార్చుకోని సుజాత 
  • వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటంతో సుజాతను దారుణంగా హత్య చేసిన భర్త గోపాల్
  • కడప జిల్లా చాపాడు మండలం పెద్ద చీపాడు గ్రామంలో ఘటన
కడప జిల్లా గండికోటలో మైనర్ బాలిక హత్య కేసు మరవకముందే మరో దారుణం చోటుచేసుకుంది. చాపాడు మండలం పెద్దచీపాడులో కట్టుకున్న భార్యను దారుణంగా హతమార్చి, ఆమె మృతదేహాన్ని అడవిలో పడేసి నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

వివరాల్లోకి వెళితే.. పెద్ద చీపాడు గ్రామానికి చెందిన నల్లబోతుల గోపాల్, సుజాత దంపతులకు 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గోపాల్ ప్రైవేటు ట్రావెల్స్‌లో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, సుజాతకు కల్లూరుకు చెందిన తాపీ మేస్త్రీ చెన్నయ్యతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది.

ఈ విషయం సుజాత భర్త గోపాల్‌కు తెలియడంతో ఆగ్రహానికి గురయ్యాడు. ఈ వ్యవహారంపై బంధువులు, పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించినా సుజాత ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో గోపాల్ తన కుటుంబాన్ని హైదరాబాద్‌కు మార్చాడు. కొంతకాలం అక్కడ నివాసం ఉన్న తర్వాత సుజాత తిరిగి పెద్ద చీపాడు వచ్చి చెన్నయ్యతో సంబంధం కొనసాగించింది.

దీంతో ఆగ్రహించిన గోపాల్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిద్రిస్తున్న సుజాతను కత్తితో దారుణంగా పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని గోనె సంచిలో వేసుకుని స్కూటీపై మైదుకూరు మండలం పనిపెంట అటవీ ప్రాంతంలోని లోయలో పడేసి ఇంటికి వెళ్లిపోయాడు.

ఆ మరుసటి రోజు కడప పరిసర ప్రాంతాల్లో సంచరించాడు. అనంతరం మైదుకూరు పోలీస్ స్టేషన్ ప్రాంతంలో తిరిగాడు. పోలీసులకు లొంగిపోవాలని అనుకున్నప్పటికీ ధైర్యం చాలలేదు. దీంతో తనకు తెలిసిన ఓ హోంగార్డుకు విషయం చెప్పగా, అతను స్టేషన్‌కు వెళ్లి లొంగిపోవాలని సలహా ఇచ్చాడు. దీంతో గోపాల్ చాపాడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భార్యను హత్య చేసినట్లు అంగీకరించాడు.

వెంటనే పోలీసులు అతన్ని వెంటబెట్టుకుని సుజాత మృతదేహం కోసం పనిపెంట అటవీ ప్రాంతంలో గాలించారు. శుక్రవారం రాత్రి సమయంలో వెతికినా ఫలితం లేకపోవడంతో శనివారం ఉదయం మళ్లీ గాలించగా సుజాత మృతదేహం లభ్యమైంది. అప్పటికే రెండు రోజులు కావడంతో మృతదేహం కుళ్లిపోయింది. దీంతో వైద్యులను అక్కడికే పిలిపించి పోస్టుమార్టం నిర్వహించి, పంచనామా పూర్తి చేశారు. సుజాత భర్త గోపాల్‌పై హత్య కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. 
Nallabothula Gopal
Kadapa district
wife murder
extra marital affair
Sujatha murder
Andhra Pradesh crime
Chapadu mandal
Pani Penta forest
crime news
domestic violence

More Telugu News