Jaggareddy: కేసీఆర్ పదేళ్ల పాలన 'ఆహా నా పెళ్లంట'లో కోట శ్రీనివాసరావు తిన్న కోడిలా ఉండేది: జగ్గారెడ్డి

Jaggareddy Slams KCR Rule Compares to Kota Srinivasa Rao in Aha Naa Pellanta
  • రేవంత్ రెడ్డిని తిడుతుంటే తన రక్తం మరుగుతుందన్న జగ్గారెడ్డి
  • కాంగ్రెస్ పాలనపై సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ నియోజకవర్గాల్లో సమావేశాలకు సిద్ధమా? అని సవాల్
  • కాంగ్రెస్ పార్టీపై విశ్వాసంతో ప్రజలు గెలిపించారన్న జగ్గారెడ్డి
పదేళ్ల కేసీఆర్ పాలన 'ఆహా నా పెళ్లంట' సినిమాలో కోట శ్రీనివాసరావు తిన్న కోడిలాగా ఉండేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ నేతలు తిడుతుంటే తన రక్తం మరుగుతోందని అన్నారు. గాంధీ భవన్‌లో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనపై సిద్దిపేట, సిరిసిల్లా, గజ్వేల్ నియోజకవర్గాల్లో సమావేశాలు పెట్టేందుకు సిద్ధమా అని కేటీఆర్‌కు సవాల్ విసిరారు.

చర్చకు మీ కుటుంబం సిద్ధమంటే, మా కాంగ్రెస్ కుటుంబం కూడా సిద్ధంగా ఉందని అన్నారు. ఈ సమావేశానికి అయ్యే ఖర్చును కూడా రేవంత్ రెడ్డి భరిస్తారని హామీ ఇచ్చారు. అందుకు తాను ముఖ్యమంత్రిని ఒప్పిస్తానని చెప్పారు. ఏ శాఖపై చర్చ చేద్దామో చెబితే, ఆ మంత్రిని కూడా చర్చకు ఒప్పిస్తానని జగ్గారెడ్డి తెలిపారు. చదువు అంటే భవిష్యత్తు కాబట్టే మా ప్రభుత్వం పిల్లల చదువుపై ఖర్చు చేస్తోందని అన్నారు. కేటీఆర్‌ను చూస్తుంటే తనకు జాలి వేస్తోందని వ్యాఖ్యానించారు.

సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ నియోజకవర్గాల్లో పెట్టే ఈ సమావేశాలకు మహిళలను పిలిచి ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఉపయోగం ఉందా, లేదా అని అడుగుదామని అన్నారు. తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని, వారిని భూమిలో పాతిపెట్టి పాములు వదిలే శిక్ష వేయాలని అన్నారు. ఏం తప్పు చేశారని ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ పార్టీపై, రాహుల్ గాంధీ నాయకత్వంపై విశ్వాసంతో ప్రజలు తమకు అధికారం ఇచ్చారని జగ్గారెడ్డి అన్నారు. పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. కానీ తాము అధికారంలోకి వచ్చిన ఈ 18 నెలల కాలంలోనే ఎన్నో చేశామని జగ్గారెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఎన్నో హామీలు ఇచ్చి నెరవేర్చలేదని ఆరోపించారు.
Jaggareddy
Telangana Congress
KCR
Revanth Reddy
BRS leaders
Telangana Politics

More Telugu News