Fish Venkat: రామ్ చరణ్ సాయం చేశాడన్న పుకార్లతో ఇంకెవరూ సాయం చేసేందుకు ముందుకు రాలేదు: ఫిష్ వెంకట్ కుమార్తె

Fish Venkat No Help Due to Ram Charan Rumors Says Daughter
  • నిన్న ఫిష్ వెంకట్ కన్నుమూత
  • శోకసంద్రంలో కుటుంబం
  • పరిశ్రమ నుంచి ఎలాంటి సాయం అందలేదన్న కుమార్తె 
టాలీవుడ్‌లో ప్రముఖ కమెడియన్‌గా, నటుడిగా గుర్తింపు పొందిన ఫిష్ వెంకట్ (53) కిడ్నీ సంబంధిత వ్యాధితో హైదరాబాద్‌లోని ఆర్బీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మరణించారు. ఆయన మరణంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సందర్భంలో ఫిష్ వెంకట్ కూతురు స్రవంతి మీడియాతో మాట్లాడుతూ, తన తండ్రి చికిత్స కోసం సినీ పరిశ్రమ నుంచి ఎలాంటి సాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

రామ్ చరణ్ సాయం చేశాడన్న పుకార్లతో ఇంకెవరూ సాయం చేసేందుకు ముందుకు రాలేదని వాపోయారు. క్లీంకార ఫౌండేషన్ నుంచి రూ.25 వేలు అందాయని వెల్లడించారు. అయితే, ఫిష్ వెంకట్ ను రామ్ చరణ్ మంచి ఆసుపత్రిలో చేర్చారని, ఆర్థికసాయం చేశాడంటూ తప్పుడు ప్రచారం జరిగిందని, దాంతో సాయం చేసేందుకు ఇంకెవరూ ముందుకు రాలేదని వివరించారు. సినీ పరిశ్రమ నుంచి విష్వక్సేన్, జెట్టి ఫేమ్ కృష్ణ మానినేని మాత్రం సాయం చేశారని స్రవంతి వెల్లడించారు. తన తండ్రి చనిపోయాక గబ్బర్ సింగ్ టీమ్ తప్ప మరెవరూ తమను పరామర్శించేందుకు రాలేదని వెల్లడించారు. 

స్రవంతి మాట్లాడుతూ, "మా నాన్న చాలా ఏళ్లుగా సినీ పరిశ్రమలో పనిచేశారు. అయితే, ఆయన ఆరోగ్యం క్షీణించిన సమయంలో ఎవరూ ముందుకు రాలేదు. రెండు కిడ్నీలు పాడై, ఆయన మాట్లాడలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా సినీ పరిశ్రమ నుంచి ఎలాంటి సహాయం రాలేదు" అని కన్నీటితో చెప్పారు. కిడ్నీ మార్పిడి కోసం దాదాపు 50 లక్షల రూపాయలు అవసరమని, ఈ భారీ ఖర్చును భరించే స్థోమత తమ కుటుంబానికి లేదని ఆమె తెలిపారు.

గతంలో ప్రభాస్ బృందం నుంచి ఆర్థిక సాయం అందుతుందని ఒక కాల్ వచ్చినట్లు స్రవంతి తెలిపారు. "ప్రభాస్ మేనేజర్ నుంచి కాల్ వచ్చి, 'ఏదైనా సాయం కావాలంటే చెప్పండి, డోనర్ దొరికితే మా వంతు సాయం చేస్తాం' అని చెప్పారు" అని ఆమె వెల్లడించారు. అయితే, ఆ తర్వాత ఎలాంటి సాయం అందలేదని, ఆ కాల్ ఫేక్ అని తర్వాత తెలిసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

కాగా, తన తండ్రికి లివర్ కూడా డ్యామేజి అయినట్టు  డాక్టర్లు నిన్న చెప్పారని ఆమె వెల్లడించారు. తాము కిడ్నీలు మాత్రమే ఫెయిలైనట్టు భావించామని, టెస్టులు చేస్తే కాలేయం కూడా దెబ్బతిన్న విషయం తెలిసిందని వివరించారు. 
Fish Venkat
Tollywood
Telugu actor
kidney disease
Ram Charan
Vishwak Sen
Klimkaara Foundation
Krishna Manineni
Prabhas
Gabbar Singh team

More Telugu News