Amit Shah: 2027 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: అమిత్ షా

Amit Shah India to be 3rd Largest Economy by 2027
  • అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతూ ముందుకు వెళుతున్నామన్న అమిత్ షా
  • మోదీ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ నాలుగో స్థానానికి వచ్చిందన్న అమిత్ షా
  • 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబెడతామన్న అమిత్ షా
2027 నాటికి భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడుతూ శరవేగంగా ముందుకు సాగుతోందని ఆయన అన్నారు. ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో అమిత్ షా ప్రసంగిస్తూ, 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో అభివృద్ధి వేగవంతమైందని తెలిపారు.

గడిచిన పదేళ్లలో దేశాభివృద్ధి 60 శాతం వృద్ధిని నమోదు చేసిందని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా 45 వేల కిలోమీటర్ల మేర రైల్వే లైన్లు, రోడ్లు నిర్మించినట్లు అమిత్ షా వెల్లడించారు. వాజ్ పేయి హయాంలో భారతదేశం 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, మోదీ పాలనలో నాలుగో స్థానానికి చేరుకుందని, త్వరలోనే మూడో స్థానానికి ఎదుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబెట్టేందుకు మోదీ సంకల్పించారని ఆయన పునరుద్ఘాటించారు.

ప్రస్తుతం ఆర్థిక ర్యాంకింగ్స్‌లో అమెరికా, చైనా, జర్మనీ మాత్రమే భారత్ కంటే ముందున్నాయని ఆయన గుర్తు చేశారు. ఇదే విధంగా మనం ముందుకు సాగితే మరో మూడేళ్లలో జర్మనీని అధిగమిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దీని కోసం మూలధన వ్యయాల పెంపు, సులభతర వాణిజ్య నిర్వహణ, దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ కంపెనీలను ఆహ్వానించడం వంటి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు.
Amit Shah
Indian economy
India economy
Third largest economy
Economic growth India

More Telugu News