Nara Lokesh: గన్నవరంలో ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Inaugurates Eclat Health Solutions Office in Gannavaram
  • వైద్య సేవల రంగంలో పేరుగాంచిన ఎక్లాట్
  • గన్నవరం సమీపంలోని కేసరవపల్లిలో కార్యాలయం ఏర్పాటు
  • రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలన చేసిన మంత్రి నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ లో ప్రతి నగరం డిజిటల్ గ్రోత్ ఇంజిన్ గా ఎదగాలని కోరుకుంటున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. వైద్య సాంకేతికత, సేవల రంగంలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఎక్లాట్(E-CLAT) హెల్త్ సొల్యూషన్స్ సంస్థ విజయవాడ గన్నవరం సమీపం కేసరపల్లిలోని మేధా హైటెక్ సిటీ భవనంలో నూతనంగా ఏర్పాటుచేసిన కార్యాలయాన్ని మంత్రి నారా లోకేశ్ నేడు రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. అంతకుముందు మేధ టవర్స్ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. ప్రాంగణంలో మొక్కను నాటారు. 

ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ ఏర్పాటు విజయవాడకు గర్వకారణం

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. ఈ రోజు విజయవాడలో మెడికల్ కోడింగ్ కంపెనీ ఎక్లాట్(E-CLAT) హెల్త్ సొల్యూషన్స్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నాని తెలిపారు. "విజయవాడ నగరానికి ఇది ఎంతో గర్వకారణం కానుంది. అంతర్జాతీయ ఐటీ రంగంలో ఏపీ ఎదుగుతున్న తీరుకు ఇది నిదర్శనంగా నిలుస్తుంది. ముందుగా సంస్థ స్థాపకులు కార్తిక్ పోల్సాని, స్నేహ పోల్సాని గారికి హృదయపూర్వక అభినందనలు. అందరూ మెగా నగరాలపై దృష్టిసారించగా.. మీరు చిన్న నగరాలపై నమ్మకం ఉంచారు. కొద్దిమందితో ప్రారంభమైన ఈ సంస్థ, ప్రస్తుతం 3500 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉంది. కరీంనగర్‌ను ఒక రిస్క్‌గా కాకుండా అవకాశంగా చూసి విజయవంతమయ్యారు. ఇప్పుడు అదే దృఢసంకల్పంతో విజయవాడకు వచ్చారు. ఇది కేవలం కంపెనీ ప్రారంభం మాత్రమే కాదు.. ఎంతోమంది కలల ప్రారంభం. డిజిటల్ సాధికారతకు నాంది" అని లోకేశ్ వివరించారు.

అమెరికాలో అతిపెద్ద హెల్త్ వ్యవస్థ!

ఆరోగ్య సంరక్షణలో అమెరికాలోనే అతిపెద్ద వ్యవస్థను ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ కంపెనీ కలిగి ఉంది. రెవెన్యూ, డేటా అనలటిక్స్, ఏఐ ఆధారిత క్లినికల్ డాక్యుమెంటేషన్ సొల్యుషన్స్ లో ఈ కంపెనీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. మెడికల్ కోడింగ్, బిల్లింగ్, ఆడిటింగ్, క్లినికల్ డాక్యుమెంటేషన్, హెచ్ సీసీ కోడింగ్, సాఫ్ట్ వేర్ ఆధారిత పరిష్కారాలలో ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ సంస్థకు నైపుణ్యం ఉంది. 2008 ఏడాదిలో కార్తీక్ పోల్సాని ఈ సంస్థను స్థాపించారు. స్నేహ పోల్సాని నేతృత్వంలో మరింత వేగంగా కంపెనీ తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. 

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 3వేలకు పైగా నిపుణులను ఈ సంస్థ నియమించింది. మనదేశంలోని హైదరాబాద్, కరీంనగర్, లక్నో, ముంబై నగరాల్లో కంపెనీ తన కార్యకలాపాలను విస్తరించింది. విజయవాడలోని మేధ ఐటీ పార్క్ లో 25వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు. స్థాపించిన రెండు నెలల్లోనే 300కు పైగా ఉద్యోగ నియామకాలు చేపట్టారు. వచ్చే ఏడాదిలోగా మరో వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు.


Nara Lokesh
Eclat Health Solutions
Vijayawada
Medical Coding
IT Sector AP
Kesarapalli
Medha High Tech City
Healthcare
Digital Growth
Karthik Polsani

More Telugu News