Roja: రోజాపై టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు... తీవ్రస్థాయిలో స్పందించిన జగన్

Jagan Reacts to TDP MLA Comments on Roja
  • నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ వ్యాఖ్యల దుమారం
  • నేడు సోషల్ మీడియాలో స్పందించిన వైసీపీ అధినేత జగన్
  • టీడీపీ దుష్ట సంస్కృతికి ఈ వ్యాఖ్యలు నిదర్శనమని ఆగ్రహం
  • నా సోదరి రోజా అంటూ భారీ ట్వీట్
వైసీపీ నేత, మాజీ మంత్రి రోజాపై నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా ఆరోపణలు రావడం తెలిసిందే. గత కొన్నిరోజులుగా వైసీపీ నేతలు భానుప్రకాశ్ పై నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా, వైసీపీ అధినేత జగన్ తొలిసారిగా ఈ వ్యవహారంపై స్పందించారు. రోజాపై టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో భారీ ట్వీట్ చేశారు. 

"మాజీ మంత్రి రోజాపై టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయం. తెలుగుదేశం పార్టీలో దారుణంగా మారిన దుష్ట సంస్కృతికి ఆ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపుతూ గట్టిగా మాట్లాడుతున్నందుకు, వాటిని ప్రశ్నిస్తున్నందుకూ ఓర్చుకోలేక, రెండుసార్లు ఎమ్మెల్యేగానూ, మంత్రిగానూ పని చేసిన నా సోదరి రోజాను అత్యంత అసభ్యకరమైన పదజాలంతో దూషించారు. ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. తమను విమర్శించే మహిళల గొంతు నొక్కడమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీలో ఒక తంతుగా మారిన అత్యంత హేయమైన సంస్కృతికి ఇది ఒక నిదర్శనం. 

వ్యక్తిత్వ హననం ద్వారానే చంద్రబాబు తన రాజకీయ జీవితం కొనసాగిస్తున్నారు. నిజం చెప్పాలంటే ఒక మహిళపై అత్యంత హేయంగా ఆరోపణలు చేసి, దుష్ప్రచారం చేసి ఆయన ఉన్నత పదవి పొందారు. అప్పటి నుంచే వ్యక్తిగత దాడులు, స్త్రీలను ద్వేషించే తత్వం తెలుగుదేశం పార్టీకి ఒక బ్రాండ్‌గా మారింది. ధైర్యంగా మాట్లాడే మహిళలను భయపెట్టి వారి నోరు మూయించడానికి నిస్సిగ్గుగా అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంతో పాటు, విమర్శించడాన్ని ఆ పార్టీ నాయకులు ఒక ఆనవాయతీగా పెట్టుకున్నారు. 

ఆ కోవలోనే గత ఏడాది కాలంగా అనేక మంది మహిళా నాయకురాళ్లను వారు దారుణంగా వేధించారు, అవమానించారు. తనపై ఒక ఎమ్మెల్యే చేసిన అత్యంత హేయమైన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేయడానికి రోజా వెళ్లగా, వాస్తవాలు స్పష్టంగా కళ్లెదుటే కనిపిస్తున్నా పోలీసులు తిరిగి ఆమెపైనే సందేహాలు వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా మారింది? టీడీపీ గుండాలను రక్షించేందుకు వారు ఏ స్థాయిలో తమ బాధ్యత, కర్తవ్యాన్ని మర్చి వ్యవహరిస్తున్నారన్నది చూపుతున్నాయి. 

నిజానికి ఒక్క రోజా విషయంలోనే కాదు. మాజీ మంత్రి విడదల రజని, కృష్ణా జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్‌ ఉప్పాల హారికతో పాటు, మా పార్టీకి చెందిన పలువురు నాయకుల కుటుంబ సభ్యుల విషయంలో కూడా చాలా అవమానకర ఘటనలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వచ్చాక మహిళలకు ఏ మాత్రం రక్షణ లేకుండా పోయింది. వారికి కనీస గౌరవ, మర్యాదలు దక్కడం లేదు. వారికి ఏ విధంగానూ న్యాయం జరగడం లేదు. 

ఇకనైనా మాజీ మంత్రి రోజాను దారుణంగా అవమానించిన ఎమ్మెల్యే భానుప్రకాశ్ ను తక్షణమే అరెస్టు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి" అంటూ జగన్ డిమాండ్ చేశారు.
Roja
Gali Bhanu Prakash
Jagan
TDP
YS Jagan
Andhra Pradesh Politics
YS Jagan Mohan Reddy
Roja Selvamani
Telugu Desam Party
Women Safety

More Telugu News