Etela Rajender: బీఆర్ఎస్ నుంచి బయటకు రావడానికి కారణాలున్నాయి: ఈటల రాజేందర్

Etela Rajender Explains Reasons for Leaving BRS
  • తాను పదవుల కోసం మాత్రం పార్టీ మారలేదన్న ఈటల రాజేందర్
  • కేసీఆర్‌కు మొహమాటం లేకుండా నా నిర్ణయాలు చెప్పేవాడినన్న ఈటల
  • తన ఓటమికి చాలామంది కుట్రలు చేశారన్న ఈటల రాజేందర్
బీఆర్ఎస్ నుంచి తాను బయటకు రావడానికి అనేక కారణాలు ఉన్నాయని, అయితే పదవుల కోసం మాత్రం పార్టీ మారలేదని మల్కాజ్‌గిరి ఎంపీ, బీజేపీ నేత ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. శామీర్‌పేటలో హుజూరాబాద్ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హుజూరాబాద్ త్యాగాలకు అడ్డా అని కొనియాడారు. హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి అనేక పోరాటాలు చేశామని ఆయన గుర్తు చేశారు.

కొంతమంది సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు తన అభిప్రాయాలను కేసీఆర్‌కు మొహమాటం లేకుండా చెప్పేవాడినని తెలిపారు. తాను అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశానని అన్నారు. తాను బీఆర్ఎస్‌ను వీడిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ ఆత్మగౌరవం నిలబడిందని ఆయన వ్యాఖ్యానించారు.

హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమికి చాలామంది కుట్రలు చేశారని ఆయన ఆరోపించారు. కరీంనగర్ జిల్లాలో తాను అడుగు పెట్టని గ్రామాలు లేవని అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో వార్డు సభ్యులను గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తాను పోరాటాలు చేయకుంటే కరీంనగర్ ప్రజలు అండగా ఉండేవారా అని ఆయన ప్రశ్నించారు.
Etela Rajender
BRS
BJP
Huzurabad
Telangana Politics
KCR
Shamirpet
Malkajgiri MP
Karimnagar

More Telugu News