Donald Trump: మాతో ఆట‌లు వ‌ద్దు.. బ్రిక్స్ కూటమిని మరోసారి హెచ్చరించిన ట్రంప్

Donald Trump Warns BRICS Again on Trade Policies
  • డాలర్ ప్రపంచ ఆధిపత్యాన్ని సంరక్షించడమే తన లక్ష్యమని వెల్ల‌డి
  • యూఎస్‌లో సెంట్ర‌ల్ బ్యాంక్ డిజిట‌ల్ క‌రెన్సీని సృష్టించ‌డానికి అనుమ‌తించ‌మ‌న్న‌ ట్రంప్
  • బ్రిక్స్ దేశాలు డాలర్‌ను, దాని ఆధిపత్యాన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నాయని వ్యాఖ్య‌
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. బ్రిక్స్ కూటమిలోని దేశాలను మరోసారి హెచ్చరించారు. బ్రిక్స్ దేశాలు త‌మ దేశ విధానాల‌కు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తే అదనంగా 10 శాతం సుంకాలు విధిస్తామన్నారు. శుక్రవారం వైట్‌హౌస్‌లో క్రిప్టోకరెన్సీ చట్టాన్ని ఆమోదించిన సందర్భంగా ట్రంప్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన బ్రిక్స్ కూటమిని లక్ష్యంగా చేసుకుని బెదిరింపుల‌కు దిగారు.

బ్రిక్స్ చిన్న సమూహమని, అది వేగంగా పతనమవుతోందని ట్రంప్ వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. బ్రిక్స్ దేశాలు డాలర్‌ను, దాని ఆధిపత్యాన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నాయని, అలాంటి చర్యలను సహించేదిలేదని ట్రంప్ స్పష్టం చేశారు. డాల‌ర్‌కు ఉన్న ప్ర‌పంచ‌వ్యాప్త గుర్తింపును ర‌క్షిస్తాన‌న్నారు. అలాగే అమెరికాలో సెంట్ర‌ల్ బ్యాంక్ డిజిట‌ల్ క‌రెన్సీని సృష్టించ‌డానికి అనుమ‌తించ‌మ‌ని ట్రంప్ వెల్ల‌డించారు. 

అమెరికా కరెన్సీ పతనాన్ని తాను ఎట్టిప‌రిస్థితుల్లో అనుమతించేది లేదని స్పష్టం చేశారు. తన సుంకాల హెచ్చరిక తర్వాత జరిగిన బ్రిక్స్ సమావేశానికి హాజరు శాతం గణనీయంగా తగ్గిందని ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ పేర్కొన్నారు. వారు సుంకాలను చెల్లించదలుచుకోలేదని, అందుకే సమవేశానికి రావడానికి కూడా భయపడుతున్నారని ట్రంప్ ఎద్దేవా చేశారు.

బ్రిక్స్ కూట‌మిపై ట్రంప్ కోపానికి కారణం ఇదే!
అమెరికా డాలర్ ప్రపంచ ముడి చెల్లింపులు కరెన్సీగా ప్రాముఖ్యం కలిగి ఉంది. ఆయిల్ కొనుగోలు నుంచి అంతర్జాతీయ రుణాల వరకు డాలర్ రూపంలోనే జరుగుతున్నాయి. ఈ క్రమంలో బ్రిక్స్ దేశాలు 'డీ-డాలరైజేషన్' పేరుతో స్థానిక కరెన్సీలు వాడటంపై చర్చలు జరుపుతున్నాయి. ఇది అమెరికాకు ఆర్థికంగా, వ్యూహాత్మకంగా హాని చేయవచ్చని ట్రంప్ భావిస్తున్నారు. ఈ కారణంగానే బ్రిక్స్ దేశాలను ఒత్తిడిలో నెట్టేందుకు సుంకాల పేరుతో హెచ్చరిస్తున్నారు.
Donald Trump
BRICS
BRICS countries
US Dollar
Tariffs
De-dollarization
White House
Cryptocurrency
International trade
Currency war

More Telugu News