Mukesh Ambani: రిలయన్స్ నికర లాభంలో భారీ వృద్ధి

Mukesh Ambanis Reliance Reports Massive Profit Growth
  • ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో రూ.26,994 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ 
  • నికర లాభంలో 78 శాతం వృద్ధి నమోదు
  • తొలిసారి రిలయన్స్ చరిత్రలో ఒక త్రైమాసికంలో భారీ స్థాయిలో లాభాన్ని ఆర్జించిన వైనం
ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (2024-25)లోనే నికర లాభంలో భారీ వృద్ధి నమోదు చేసింది. ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో రూ.26,994 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే లాభంలో 78.3 శాతం వృద్ధి నమోదైంది.

ఒక త్రైమాసికంలో ఈ స్థాయిలో లాభాన్ని నమోదు చేయడం రిలయన్స్ చరిత్రలో ఇదే మొదటిసారి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రిలయన్స్ నికర లాభం రూ.15,138 కోట్లుగా ఉంది. గడిచిన త్రైమాసికం (జనవరి - మార్చి)లో రూ.19,407 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అప్పటితో పోల్చినా నికర లాభం 39 శాతం వృద్ధి నమోదు కావడం విశేషం. రిలయన్స్‌కు చెందిన వినియోగదారుల వ్యాపార విభాగాలైన రిటైల్, టెలికాం వ్యాపారాలు రాణించడంతో రికార్డు స్థాయిలో లాభం నమోదైంది.

సమీక్షా త్రైమాసికానికి కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 5.26 శాతం వృద్ధితో రూ.2.48 లక్షల కోట్లుగా నమోదైనట్లు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్ లో పేర్కొంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ మొత్తం రూ.2.36 లక్షల కోట్లుగా ఉంది. అయితే, ఓ2సీ వ్యాపారంలో ఆదాయం మాత్రం గత ఏడాదితో పోలిస్తే 1.50 శాతం మేర క్షీణించడం గమనార్హం.

మెరుగైన ఫలితాలతో ఈ ఆర్థిక సంవత్సరాన్ని ప్రారంభించామని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అంతర్జాతీయంగా అనిశ్చితులు ఉన్నా తొలి త్రైమాసికంలో మంచి ఎబిట్టా నమోదు చేశామని అన్నారు. ప్రధానంగా ఎనర్జీ మార్కెట్ తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. ఓ2సీ వ్యాపారం రాణించిందని ఆయన తెలిపారు. 
Mukesh Ambani
Reliance Industries
Reliance net profit
Reliance Q1 results
Indian economy
Reliance Retail
Jio
Reliance Jio
O2C business
Indian business news

More Telugu News