Baloch Liberation Army: పాకిస్థాన్ సైనికులను హతమార్చిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ

Baloch Liberation Army Claims Killing 27 Pakistan Soldiers
  • కరాచీ నుంచి క్వెట్టాకు వెళుతున్న బస్సుపై దాడి చేసినట్లు వెల్లడి
  • ఈ దాడిలో 27 మంది చనిపోయారన్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ
  • ఈ ఏడాది పాక్ నుంచి 45 వ్యూహాత్మక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడి
బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) గత రెండు రోజుల్లో 27 మందికి పైగా పాకిస్థాన్ సైనికులను హతమార్చినట్లు ప్రకటించింది. ఈ మేరకు బలూచ్ ఆర్మీ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఫతే స్క్వాడ్ కలాత్‌లోని నిమ్రాగ్ క్రాస్ వద్ద సైనికులను తరలిస్తున్న ఒక బస్సును లక్ష్యంగా చేసుకొని దాడి చేసింది. ఈ దాడిలో 27 మంది సైనికులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. సైనిక దళాలు ఆ బస్సులో కరాచీ నుంచి క్వెట్టాకు వెళుతుండగా ఈ దాడి జరిగింది.

కాగా, సైనికుల బస్సు వెంట సాయుధ కాన్వాయ్ ఉన్నప్పటికీ... బలూచ్ స్నైపర్లు ఆ కాన్వాయ్ ని లక్ష్యంగా చేసుకున్నారు. దాంతో ఆ కాన్వాయ్ అక్కడ్నించి సురక్షిత ప్రాంతానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరో ఘటనలో క్వెట్టాలోని హజార్‌గంజ్‌లో ఐఈడీ పేల్చిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ మరో ఇద్దరు పాకిస్థాన్ సైనికులను హతమార్చింది. మంగళవారం కలాత్‌లోని ఖజినా ప్రాంతంలో మరో ఐఈడీ పేల్చి నలుగురు సైనికులను, బుధవారం గుజ్రోకొర్ ఏరియాలో దాడి చేసి మరో ఆరుగురు సైనికులను హతమార్చినట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది.

ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్యకాలంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ 286 దాడులు చేసింది. వీటిల్లో మూడు ఆత్మాహుతి దాడులు ఉన్నాయి. ఈ దాడులలో 700 మందికి పైగా మృతి చెందగా, 290 మందిని అదుపులోకి తీసుకున్నట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ చెబుతోంది. ఈ ఏడాది ఒక రైలును హైజాక్ చేయడంతో పాటు, 45 వ్యూహాత్మక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
Baloch Liberation Army
Pakistan Army
Balochistan
BLA attacks
Pakistan military
Quetta

More Telugu News