BR Naidu: తిరుమలలో ఐఓసీఎల్ గ్యాస్ స్టోరేజి కేంద్రానికి భూమిపూజ

IOCL Gas Storage Facility Groundbreaking at Tirumala TTD
  • తిరుమలలో భారీ గ్యాస్ స్టోరేజి కేంద్రం
  • ఐఓసీఎల్-టీటీడీ సంయుక్త నిర్మాణం
  • 8.13 కోట్ల వ్యయంతో ప్లాంట్ ఏర్పాటు
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం, కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన తిరుమలలో ఐఓసీఎల్ (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్) గ్యాస్ స్టోరేజి కేంద్రానికి భూమి పూజ జరిగింది. దీనికి సంబంధించిన వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 

"టీటీడీ భవిష్యత్ అవసరాల నిమిత్తం తిరుమలలోని ఔటర్ రింగ్ రోడ్డులో 45 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గ్యాస్ స్టోరేజ్ కేంద్ర నిర్మాణానికి బుధవారం భూమిపూజ నిర్వహించాం. గత రెండు దశాబ్దాలుగా ఐఓసీఎల్ సంస్థ ఎల్పీజీని టీటీడీకి నిరంతరాయంగా సరఫరా చేస్తోంది. ఇకపై 30 సంవత్సరాల పాటు ఎల్పీజీ సరఫరాకు టీటీడీ-ఐఓసీఎల్ మధ్య ఒప్పందం కుదిరింది. రూ.8.13 కోట్ల వ్యయంతో 1.86 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్‌ నిర్మాణాన్ని టీటీడీ-ఐఓసీఎల్ సంయుక్తంగా ఆరు నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించాయి. ఈ గ్యాస్‌ను లడ్డూ ప్రసాదాలు, అన్నప్రసాదాల తయారీకి వినియోగిస్తాం. 

ఐఓసీఎల్ ఇప్పటికే తిరుమల డంపింగ్ యార్డు వద్ద రూ.12.05 కోట్ల వ్యయంతో బయో గ్యాస్ ప్లాంట్ నిర్మాణం చేపట్టింది. ప్రతి రోజు వచ్చే 55 టన్నుల తడి వ్యర్థాలలో 40 టన్నులు ఐఓసీఎల్ ప్లాంటుకు తరలించి రోజుకు 1000 కేజీల బయో గ్యాస్‌ను ఉత్పత్తి చేయనున్నారు. 

కాగా, నూతనంగా నిర్మితమవుతున్న ప్లాంట్‌లో 45 మెట్రిక్ టన్నుల మౌంటెడ్ స్టోరేజ్ వెసల్స్, 1500 కిలోల వేపరైజర్, అగ్నిమాపక యంత్రాంగం, స్ప్రింక్లర్ వ్యవస్థ, రెండు వాటర్ ట్యాంకులు, డీజిల్ జనరేటర్ సెట్, రిమోట్ ఆపరేటింగ్ వాల్వులు, గ్యాస్ లీకేజ్ అలారం, ట్యాంక్ లారీ డికాంటేషన్ వ్యవస్థ, సీసీటీవీ, జీఎంఎస్, టీఎఫ్‌ఎంఎస్‌, ఐఎల్‌ఎస్‌డీ వంటి అత్యాధునిక భద్రతా పరికరాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీఈ శ్రీ సత్య నారాయణ, ఈఈ శ్రీ సుబ్రహ్మణ్యం, డీఈ శ్రీ చంద్రశేఖర్, ఇతర టీటీడీ, ఐఓసీఎల్ అధికారులు పాల్గొన్నారు" అని బీఆర్ నాయుడు వివరించారు.
BR Naidu
Tirumala
TTD
IOCL
Gas Storage
LPG Supply
Bio Gas Plant
Andhra Pradesh
Laddoo Prasadam
Anna Prasadam

More Telugu News