Malaysia: మలేషియాలో ఒకే చోట భారతీయ వివాహం.. చైనీయుల అంత్యక్రియలు!

Malaysia Indian Wedding and Chinese Funeral Held Simultaneously
  • ఒకే వీధిలో రెండు భిన్న సంస్కృతులకు సంబంధించిన కార్యక్రమాలు
  • ఒకరేమో సంతోషంలో.. మరొకరు శోకతప్త హృదయాలతో
  • ఈ రెండు ఊరేగింపులు గౌరవంగా జరిగాయన్న యూజర్
  • ఈ దృశ్యాన్ని మలేషియా బహుసాంస్కృతిక సామరస్యానికి చిహ్నంగా భావిస్తున్న యూజర్లు
మలేషియాలోని ఒక ప్రాంతంలో ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఒక భారతీయ వివాహ వేడుక, చైనీస్ అంత్యక్రియలు ఒకే సమయంలో పక్కపక్కనే జరిగాయి. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అంది. భిన్న సంస్కృతులకు చెందిన రెండు ఘటనలు ఒకే వీధిలో జరగడం గమనార్హం. వీడియోలో, ఒకవైపు భారతీయ వివాహ ఊరేగింపు సందడిగా సాగుతోంది. సంగీతం, నృత్యాలతో ఆ ప్రాంతమంతా కళకళలాడుతూ కనిపించింది.

వధువు, వరుడు సంప్రదాయ దుస్తుల్లో ఉండగా, వారి కుటుంబ సభ్యులు, అతిథులు సంతోషంగా ఊరేగింపులో పాల్గొన్నారు. అదే సమయంలో, కేవలం కొన్ని గజాల దూరంలో, ఒక చైనీస్ అంత్యక్రియల ఊరేగింపు జరుగుతోంది, ఇందులో శోకతప్త సంగీతం, తెల్లటి దుస్తులు ధరించిన కొందరు, సంప్రదాయ దుస్తుల్లో అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

ఈ వీడియోను మలేషియన్ ఫోటోగ్రాఫర్ అమీరుల్ రిజ్వాన్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఎక్స్‌లో దీనిని ఇప్పటి వరకు 5.6 మిలియన్ల మందికిపైగా వీక్షించారు. అమీరుల్ తన పోస్ట్‌లో “మలేషియాలో జీవితంలోని రెండు విభిన్న దశలు ఒకే వీధిలో ఒకేసారి కనిపిస్తున్నాయి. ఒకపక్క భారతీయ వివాహం, మరోవైపు చైనీస్ అంత్యక్రియలు” అని రాశాడు. 

ఈ రెండు ఊరేగింపులు ఒకదానికొకటి గౌరవంగా జరిగాయని, ఎటువంటి ఆటంకం లేకుండా పరస్పర గౌరవంతో కొనసాగాయని ఆయన తెలిపాడు. సోషల్ మీడియా వినియోగదారులు ఈ దృశ్యాన్ని మలేసియా బహుసాంస్కృతిక సామరస్యానికి చిహ్నంగా ప్రశంసించారు.  “ఇది మలేషియా అందమైన బహుసాంస్కృతిక సమాజాన్ని చూపిస్తుంది, ఇక్కడ విభిన్న సంఘటనలు ఒకే స్థలంలో సామరస్యంగా జరుగుతాయి” అని ఒక యూజర్ రాసుకొచ్చాడు. “జీవితం, మరణం ఒకే రహదారిపై కలిసిన ఈ దృశ్యం జీవితంలోని రెండు ముఖాలను చూపిస్తుంది” అని మరో యూజర్ రాసుకొచ్చాడు.  
Malaysia
Indian Wedding
Chinese Funeral
Multiculturalism
Social Harmony
Viral Video
Cultural Respect
Amirul Rizwan

More Telugu News