Air India: బోయింగ్‌ ఇంధన స్విచ్చుల్లో ఎలాంటి సమస్యల్లేవ్‌: ఎయిరిండియా

Air India Finds No Issues With Fuel Control Switches On Boeing 787 Planes
  • బోయింగ్‌ విమానాల్లో ఇంధన స్విచ్ఛులపై తనిఖీ చేపట్టాలని విమానయాన సంస్థలకు డీజీసీఏ ఆదేశాలు
  • ఈమేరకు తనిఖీలు చేపట్టిన ఎయిరిండియా
  • తాము నడుపుతున్న బోయింగ్‌ విమానాల ఎఫ్‌సీఎస్ లలో ఎలాంటి సమస్యలు లేవని వెల్లడి
అహ్మదాబాద్‌ విమాన దుర్ఘటన తర్వాత విమానాల భద్రతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈనేపథ్యంలో బోయింగ్‌ విమానాల్లో ఇంధన స్విచ్ఛులపై తనిఖీ చేపట్టాలని అన్ని విమానయాన సంస్థలకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) గత సోమవారం ఆదేశాలు జారీ చేసింది. 

ఈ నెల‌ 21 నాటికి నిర్దిష్ట బోయింగ్ విమాన నమూనాల ఫ్యుయ‌ల్ కంట్రోల్ స్వీచ్‌ (FCS)ను తనిఖీ చేయాలని ఆదేశించింది. ఈమేరకు తనిఖీలు చేపట్టిన ఎయిరిండియా, తాము నడుపుతున్న బోయింగ్‌ విమానాల ఇంధన స్విచ్ఛులలో ఎలాంటి సమస్యలు లేవని వెల్లడించింది. మెయింటనెన్స్‌ షెడ్యూల్‌లో భాగంగా బోయింగ్‌ 787-8 విమానంలో కంట్రోల్‌ మాడ్యూల్‌లను మార్చినట్టు పేర్కొంది.

"బోయింగ్ నిర్వహణ షెడ్యూల్ ప్రకారం మా అన్ని బోయింగ్ 787-8 విమానాలు థొరెటల్ కంట్రోల్ మాడ్యూల్ (TCM) రిప్లేస్‌మెంట్ చేశాం. ఎఫ్‌సీఎస్ ఈ మాడ్యూల్‌లో భాగం" అని ఎయిర్ ఇండియా అధికారి ఒకరు తెలిపారు.

"వారాంతంలో మా ఇంజనీరింగ్ బృందం మా బోయింగ్ 787 విమానాలన్నింటిలోనూ ఎఫ్‌సీఎస్ లాకింగ్ మెకానిజంపై ముందు జాగ్రత్త తనిఖీలను ప్రారంభించింది. తనిఖీలు పూర్తయ్యాయి. ఎటువంటి సమస్యలు బ‌య‌ట‌ప‌డ‌లేదు" అని అధికారి పేర్కొన్నారు.

అంతకుముందు, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లోని దాదాపు మొత్తం బోయింగ్ 737 మాక్స్ విమానాలను కూడా తనిఖీ చేశామని, ఎటువంటి సమస్యలు లేవని ఆ అధికారి తెలిపారు.
Air India
Boeing
DGCA
fuel control switch
aviation safety
Boeing 787-8
flight safety
fuel switch issues
Ahmedabad accident

More Telugu News