Singapore: ప్రపంచ అత్యంత ఖరీదైన నగరంగా సింగపూర్.. టాప్ 10 నగరాలు ఇవే

Singapore Named Worlds Most Expensive City Again
  • వరుసగా మూడోసారి ఈ ఘనత సాధించిన సింగపూర్
  • హాంగ్‌కాంగ్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానంలోకి వచ్చిన లండన్
  • టాప్ 10 ఖరీదైన నగరాల్లో షాంఘై, మొనాకో, న్యూయార్క్, ప్యారిస్
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరంగా సింగపూర్ నిలిచింది. జూలియస్ బేర్ వార్షిక నివేదిక ప్రకారం, వరుసగా మూడో సంవత్సరం సింగపూర్ ఈ ఘనతను సొంతం చేసుకుంది. కనీసం 1 మిలియన్ డాలర్ల బ్యాంకు బ్యాలెన్స్ కలిగిన వ్యక్తులు కొనుగోలు చేస్తున్న వివిధ రకాల ఉత్పత్తులు, వారు అనుభవిస్తున్న లగ్జరీ ఆధారంగా వారి జీవన వ్యయాన్ని జూలియస్ బేర్ లైఫ్ స్టైల్ ఇండెక్స్ విశ్లేషించి ప్రపంచ ఖరీదైన నగరాల జాబితాను రూపొందించింది. ఈ ఏడాది ఫిబ్రవరి - మార్చి మధ్య సేకరించిన డేటాను పరిగణనలోకి తీసుకున్నట్లు జూలియస్ బేర్ తెలిపింది.

టాప్ 10 నగరాలను పరిశీలిస్తే, మొదటి స్థానంలో సింగపూర్ ఉండగా, ఆ తర్వాత వరుసగా లండన్, హాంగ్‌కాంగ్, షాంఘై, మొనాకో, జ్యూరిచ్, న్యూయార్క్, ప్యారిస్, సావో పౌలో, మిలాన్ నగరాలు ఉన్నాయి. గత సంవత్సరం రెండో స్థానంలో ఉన్న హాంగ్‌కాంగ్‌ను లండన్ వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరుకుంది.

సింగపూర్ అత్యంత ఖరీదైన నగరంగా నిలవడానికి వివిధ కారణాలు ఉన్నాయని విశ్లేషించింది. సింగపూర్ ఆర్థిక, రాజకీయ పరిస్థితులు అందరికీ అనుకూలంగా ఉండటంతో పలువురు అంతర్జాతీయ వ్యాపారులు సింగపూర్ కేంద్రంగా తమ వ్యాపారాలను నిర్వహించేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతంలో వెనక్కి వెళ్లిన వ్యాపారులను కూడా తిరిగి రప్పించేందుకు సింగపూర్ సంస్కరణలు చేపట్టింది. దీంతో అక్కడి జీవన వ్యయం ఒక్కసారిగా పెరిగింది.

సింగపూర్ వాసులు ఎక్కువగా బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ప్రధానంగా ఈ అంశం సింగపూర్‌ను అత్యంత ఖరీదైన నగరంగా నిలిచేలా చేసింది. సింగపూర్ ప్రజలు ఆహారం, ఆరోగ్య ఉత్పత్తులు, విద్యపై ఎక్కువగా ఖర్చు చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది.
Singapore
Most expensive city
Julius Baer
Luxury lifestyle
Global cities ranking
Cost of living

More Telugu News