Sameer Sahu: అధ్యాపకుడి వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన విద్యార్ధిని మృతి

Student dies after harassment at Baleswar FM College
  • కళాశాల ఆవరణలోనే నిప్పంటించుకున్న బీఈడీ విద్యార్ధిని 
  • బాలేశ్వర్‌లోని ఫకీర్ మోహన్ కాలేజీలో ఘటన 
  • ఎయిమ్స్ భువనేశ్వర్‌లో చికిత్స పొందుతూ మృతి
  • నిన్న ఆసుపత్రిని సందర్శించి బాధితురాలి పరిస్థితి అడిగి తెలుసుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
  • విద్యార్ధిని మృతిపై తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేసిన సీఎం మోహన్ చరణ్ మాఝి
ఒడిశాలోని బాలేశ్వర్ ఎఫ్ఎం కళాశాల ఆవరణలో అధ్యాపకుడి వేధింపులు తాళలేక ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసిన విద్యార్థిని చికిత్స పొందుతూ నిన్న అర్ధరాత్రి మృతి చెందింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

వివరాల్లోకి వెళితే.. బాలేశ్వర్‌లోని ఫకీర్ మోహన్ కాలేజీ (ఎఫ్ఎం కళాశాల)లో ఇంటిగ్రేటెడ్ బీఈడీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని విభాగాధిపతి సమీర్ సాహు కొద్ది రోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడు. తన మాట వినకపోతే భవిష్యత్తు నాశనం చేస్తానని బెదిరించాడు. ఈ వేధింపులు భరించలేక ఆమె గత నెల 30న కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది.

వారం రోజుల్లో చర్యలు తీసుకుంటామని యాజమాన్యం హామీ ఇచ్చినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురై కళాశాల ఆవరణలో నిరసన చేపట్టింది. ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం, జూన్ 12న ఒక్కసారిగా ప్రిన్సిపాల్ కార్యాలయానికి పరుగెత్తుకు వెళ్లి అక్కడే ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. మంటలకు తాళలేక హాహాకారాలు చేస్తూ పరుగెత్తుతుండగా, తోటి విద్యార్థులు ఆమెను రక్షించే ప్రయత్నం చేశారు.

వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఎయిమ్స్ భువనేశ్వర్‌కు తరలించారు. 95 శాతం కాలిన గాయాలతో మృత్యువుతో పోరాడిన ఆమె నిన్న అర్ధరాత్రి మరణించింది. శరీరం తీవ్రంగా కాలిపోయిందని, ఆమెను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని భువనేశ్వర్ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.

ఈ ఘటన రాష్ట్రంలో రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. విద్యార్థినికి న్యాయం చేయలేకపోతే ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని విపక్షాలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.

ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం, వైద్య బృందం ఎంత ప్రయత్నించినా ఆమె ప్రాణాలు దక్కకపోవడం విచారకరమని అన్నారు. ఆమె మృతికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు. ఆమె మృతికి కారణమైన వారికి కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు.

మరోవైపు, ఒడిశా పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నిన్న మధ్యాహ్నం ఆసుపత్రికి వెళ్లి బాధితురాలి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో ఇప్పటికే బాలేశ్వర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దిలీప్ ఘోష్‌ను సస్పెండ్ చేయడంతో పాటు పోలీసులు నిన్న అరెస్టు చేశారు. విద్యార్థినిని లైంగికంగా వేధించిన అధ్యాపకుడు సమీర్ సాహును కూడా అరెస్టు చేసి పోలీసు కస్టడీకి తీసుకున్నారు. 
Sameer Sahu
Baleswar FM College
Odisha student suicide
student harassment case
sexual harassment
Bhubaneswar AIIMS
Droupadi Murmu
Mohan Charan Majhi
Fakir Mohan College
college principal suspended

More Telugu News