Andrei Besedin: రష్యాకు 10 లక్షల మంది నిపుణులైన భారత కార్మికులు

Russia to Hire 1 Million Indian Skilled Workers by 2025
  • రష్యా పారిశ్రామిక ప్రాంతాల్లో తీవ్రమైన కార్మికుల కొరత
  • ఈ ఏడాది చివరి నాటికి భారత్ నుంచి 10 లక్షల మందిని దిగుమతి చేసుకోనున్న రష్యా
  • విదేశీ నైపుణ్య కార్మికుల కోటాను 1.5 రెట్లు పెంచి 2.3 లక్షల మందికి చేర్చే యోచన
రష్యాలోని పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికుల కొరతను తీర్చేందుకు 2025 సంవత్సరం చివరి నాటికి భారత్ నుంచి 10 లక్షల మంది నైపుణ్యం కలిగిన కార్మికులను దిగుమతి చేసుకోవాలని మాస్కో యోచిస్తోంది. ఉరల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు ఆండ్రీ బెసెడిన్, రోస్‌బిజినెస్‌కన్సల్టింగ్ (ఆర్బీసీ) ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ “ఈ ఏడాది చివరి నాటికి భారత్ నుంచి 10 లక్షల మంది నిపుణులైన కార్మికులు రష్యాకు వస్తారు, వీరిలో కొందరు స్వెర్డ్‌లోవ్స్క్ ప్రాంతంలో పనిచేస్తారు. ఈ విషయాలను పర్యవేక్షించేందుకు యెకాటెరిన్‌బర్గ్‌లో కొత్త కాన్సులేట్ జనరల్ తెరుస్తున్నాం’’ అని పేర్కొన్నారు. 

యెకాటెరిన్‌బర్గ్ రాజధాని అయిన స్వెర్డ్‌లోవ్స్క్ ఉరల్ పర్వతాల్లో ఉంది. ఇక్కడ ప్రపంచ ప్రసిద్ధ ఉరల్‌మాష్, టీ-90 సిరీస్ ట్యాంక్ తయారీ సంస్థ ఉరల్ వాగన్ జావోడ్ వంటి భారీ పరిశ్రమలు, సైనిక-పారిశ్రామిక కేంద్రాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో అత్యంత నైపుణ్యం కలిగిన కార్మికుల కొరతను భారతీయ కార్మికుల రాకతో భర్తీ చేయనున్నట్టు బెసెడిన్ వివరించారు. ఉక్రెయిన్‌లో జరుగుతున్న సైనిక చర్యల కారణంగా కొందరు కార్మికులు యుద్ధంలో పాల్గొనడం, యువత ఫ్యాక్టరీల్లో పనిచేయడానికి ఆసక్తి చూపకపోవడం వల్ల ఈ కొరత తీవ్రమైందని ఆయన తెలిపారు. 

రష్యా శ్రమ మంత్రిత్వ శాఖ ప్రకారం 2030 నాటికి దేశంలో 31 లక్షల మంది కార్మికుల కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు 2025లో విదేశీ నైపుణ్య కార్మికుల కోటాను 1.5 రెట్లు పెంచి 2.3 లక్షల మందికి చేర్చాలని ప్రతిపాదించింది. 2024లో గతంలోని సోవియట్ రిపబ్లిక్‌లు కాని దేశాల నుంచి 47,000 మంది నైపుణ్య కార్మికులు వచ్చినట్టు మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. అయితే, గత ఏడాది మార్చి 22న మాస్కోలోని క్రోకస్ సిటీ హాల్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత, మాజీ సోవియట్ రిపబ్లిక్‌ల నుంచి వలసలను నియంత్రించేందుకు రష్యా అధికారులు కఠినమైన వలస చట్టాలను అమలు చేశారు. 

ఈ కార్యక్రమం భారత్-రష్యా సంబంధాల్లో కొత్త అధ్యాయాన్ని తెరవబోతోంది. రక్షణ, అంతరిక్షం, ఇంధన రంగాల్లో బలమైన సహకారం ఉన్న ఈ రెండు దేశాలు, ఇప్పుడు కార్మిక వలసల ద్వారా ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోనున్నాయి. భారత కార్మికులు రష్యా ఐటీ, హెల్త్‌కేర్, ఇంజనీరింగ్, నిర్మాణ రంగాల్లో ఉపాధి అవకాశాలను పొందే అవకాశం ఉంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు రెమిటెన్స్ రూపంలో ప్రయోజనం చేకూర్చవచ్చు.
Andrei Besedin
Russia
Indian Workers
Labor Shortage
Skilled Workers
Russia India Relations
Rosbusinessconsulting
Urals Chamber of Commerce
Sverdlovsk
Yekaterinburg

More Telugu News