Revanth Reddy: రామోజీ ఫిల్మ్ సిటీలో 'శ్రీమద్భాగవతం' ప్రారంభోత్సవానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy Attends Srimad Bhagavatam Launch at Ramoji Film City
  • రామాయణం, మహాభారతం మన జీవితాల్లో భాగమన్న రేవంత్ రెడ్డి
  • రామోజీ ఫిల్మ్ సిటీ దేశంలోనే ప్రత్యేకమైన స్టూడియో అన్న ముఖ్యమంత్రి
  • 'రామాయణం' సీరియల్‌లా 'శ్రీమద్భాగవతం-పార్ట్1' విజయం సాధించాలని ఆకాంక్షించిన సీఎం
రామోజీ ఫిల్మ్ సిటీలో 'శ్రీమద్భాగవతం-పార్ట్ 1' చిత్రీకరణ ప్రారంభోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సాగర్ పిక్చర్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రామాయణం, మహాభారతం మన జీవితాల్లో భాగమని వ్యాఖ్యానించారు.

ఫిల్మ్ సిటీలో శ్రీమద్భాగవతం చిత్రీకరణ తెలంగాణకు గర్వకారణమని ఆయన అన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీని ఎంతో అద్భుతంగా నిర్మించారని ప్రశంసించారు. తాను యూనివర్సల్ స్టూడియోను చూడలేదని, కానీ రామోజీ ఫిల్మ్ సిటీ మాత్రం దేశంలోనే ప్రత్యేకమైన స్టూడియో అని కొనియాడారు.

రామోజీ ఫిల్మ్ సిటీ తెలంగాణలో ఉందని చెప్పడానికి గర్విస్తున్నామని ఆయన పేర్కొన్నారు. నలభై ఏళ్ల క్రితం రామాయణం సీరియల్ అందరికీ చేరువైందని, కరోనా సమయంలో మళ్లీ ఆ సీరియల్‌ను టెలికాస్ట్ చేస్తే ప్రపంచ రికార్డు సృష్టించిందని గుర్తు చేశారు.

2035 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని సంకల్పించామని ముఖ్యమంత్రి అన్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇందుకోసం విజన్ 2047 డాక్యుమెంట్ సిద్ధం చేసుకున్నామని, అందులో సినిమా రంగానికి ప్రత్యేక అధ్యాయం ఉందని వెల్లడించారు. రామానంద్ సాగర్ నాడు తీసిన 'రామాయణం' సీరియల్ ఎంతటి విజయం సాధించిందో, ఇప్పుడు శ్రీమద్భాగవతం కూడా అంతే విజయం సాధించాలని ఆకాంక్షించారు.
Revanth Reddy
Telangana CM
Srimad Bhagavatam
Ramoji Film City

More Telugu News