Microsoft: 15 వేలమందిని తొలగించిన మైక్రోసాఫ్ట్.. మిగతా వారి ఉద్యోగాలు ఉండాలంటే ఏం చేయాలో చెప్పిన కంపెనీ

Microsoft Warns Employees AI Skills Are Crucial After 15000 Layoffs
  • అన్ని విభాగాల్లోని ఉద్యోగులకు ఏఐ నైపుణ్యాలు అవసరమన్న మైక్రోసాఫ్ట్
  • ఉద్యోగులను తగ్గించడం ద్వారా 500 మిలియన్ డాలర్ల ఆదా
  • కొత్తగా ‘మైక్రోసాఫ్ట్ ఎలెవేట్’ కార్యక్రమానికి శ్రీకారం
ఈ ఏడాది ఇప్పటి వరకు 15 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించిన మైక్రోసాఫ్ట్.. మిగతా ఉద్యోగులకు కూడా హెచ్చరికలు జారీచేసింది. వారంతా ఏఐ (కృత్రిమ మేధ)లో నైపుణ్యం సాధిస్తేనే ఉద్యోగాలు ఉంటాయని, లేదంటే ఇంటికి పంపడం ఖాయమని తేల్చి చెప్పింది. ఈ ఏడాది కనీసం నాలుగు రౌండ్ల శ్రామిక శక్తిని తగ్గించిన ఈ రెడ్‌మండ్ దిగ్గజం.. ఎక్స్‌బాక్స్, గేమింగ్ విభాగం, సేల్స్ బృందాలను ప్రభావితం చేసే తాజా రౌండ్‌లో దాదాపు 9 వేలమంది ఉద్యోగులను తగ్గించింది. అలాగే, మేలో 6 వేల మందిని, జూన్‌లో కొన్ని వందల మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. 

మైక్రోసాఫ్ట్ డెవలపర్ డివిజన్ అధ్యక్షురాలు జూలియా లియుసన్ ఇటీవల మేనేజర్లకు కృత్రిమ మేధస్సు వినియోగంపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇకపై ఏఐ ఐచ్ఛికం కాదని, ప్రతి ఒక్కరు దానిని తప్పకుండా నేర్చుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. ఏఐ నైపుణ్యాలను బట్టే మీ పనితీరును అంచనా వేస్తామని పేర్కొన్నారు. అన్ని విభాగాల్లోని ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ కోపిలాట్, అజూర్ ఏఐ, గిట్‌హబ్ కోపిలాట్ వంటి టూల్స్ ఉపయోగించే సామర్థ్యం అవసరమని పేర్కొన్నారు.

ఏఐ కోసం మైక్రోసాఫ్ట్ భారీగా వ్యయం చేస్తుండటంతో నిర్వహణ వ్యయాలను తగ్గించుకోవడంలో భాగంగానే ఉద్యోగులను తొలగిస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ చర్యల ద్వారా మైక్రోసాఫ్ట్ ఇప్పటికే సుమారు 500 మిలియన్ డాలర్లను ఆదా చేసినట్టు తెలిసింది. మైక్రోసాఫ్ట్ ఈ ఏడాది ఏఐలో 80 బిలియన్ డాలర్లను వెచ్చించనుంది. ఈ ఉద్యోగాల కోతలు ఏఐ వల్ల మాత్రమే కాదని, ఖర్చుల కట్టడికి తీసుకున్న చర్యల్లో భాగమని మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్ తెలిపారు. మైక్రోసాఫ్ట్ కొత్తగా ‘మైక్రోసాఫ్ట్ ఎలెవేట్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. వచ్చే ఐదు సంవత్సరాల్లో రెండు కోట్ల మందికి ఏఐలో శిక్షణ ఇవ్వాలనే లక్ష్యంతో దీనిని రూపొందించారు. 
Microsoft
Microsoft layoffs
AI skills
Julia Liuson
Microsoft Copilot
Azure AI
GitHub Copilot
Brad Smith
Microsoft Elevate
Job cuts

More Telugu News