Sanjay Shirsat: మహారాష్ట్ర మంత్రికి ఐటీ నోటీసు.. మరుసటి రోజే నగదుతో నిండిన బ్యాగ్ వీడియో వైరల్

Sanjay Shirsat IT Notice Followed by Viral Cash Bag Video
  • 2019-2024 మధ్య మంత్రి సంజయ్ ఆస్తులు గణనీయంగా పెరిగినట్లు ఆరోపణ
  • నోటీసులు జారీ చేసిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు
  • మరుసటి రోజే ఓ గదిలో బ్యాగ్‌తో మంత్రి ఉన్న వీడియో వైరల్
  • బ్యాగ్‌లో డబ్బులు ఉన్నాయంటూ ప్రచారం
  • ఐటీ అధికారుల ఎదుట హాజరై వివరణ ఇస్తానన్న మంత్రి
మహారాష్ట్ర మంత్రి సంజయ్ షిర్సాత్ ఒక ప్రైవేట్ గదిలో నగదుతో నిండిన బ్యాగ్‌తో ధూమపానం చేస్తున్నట్లు ఉన్న ఒక వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. ఈ అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. 2019-24 అసెంబ్లీ ఎన్నికల మధ్య ఆయన ఆస్తులు గణనీయంగా పెరిగాయంటూ ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు వచ్చిన మరుసటి రోజు ఈ వీడియో వెలుగులోకి రావడం గమనార్హం.

ఆ వీడియోలో మంత్రి సంజయ్ మంచం మీద కూర్చొని ఉండగా, పక్కనే ఒక బ్యాగ్ కనిపించింది. అందులో డబ్బులు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ వీడియోను శివసేన (యూబీటీ) వర్గానికి చెందిన సంజయ్ రౌత్ తన సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో చర్చనీయాంశంగా మారింది.

ఈ వీడియోను పోస్టు చేసిన సంజయ్ రౌత్, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఉద్దేశించి, "ముఖ్యమంత్రిని చూస్తుంటే జాలి వేస్తోంది. తన ప్రతిష్ఠ పదేపదే మసకబారుతుంటే చూస్తూ ఉండిపోతున్నారు. నిస్సహాయతకు పేరు ఫడ్నవీస్ అన్నట్లుగా ఉంది" అని పేర్కొన్నారు.

ఔరంగాబాద్ (పశ్చిమ) నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సంజయ్ షిర్సాత్, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గానికి చెందిన వారు. గత ఐదేళ్లుగా తన వ్యక్తిగత ఆస్తుల పెరుగుదలపై వివరణ కోరుతూ ఆదాయపు పన్ను శాఖ తనకు నోటీసులు జారీ చేసినట్లు సంజయ్ షిర్సాత్ తెలిపారు. ఆ వీడియోలో కనిపించిన బ్యాగ్‌లో డబ్బులు లేవని, అది దుస్తులు పెట్టుకునే బ్యాగ్ అని ఆయన స్పష్టం చేశారు.

తనపై కొంతమంది ఆదాయపు పన్ను శాఖకు ఫిర్యాదు చేశారని, దీని కారణంగానే తనకు నోటీసులు జారీ అయ్యాయని ఆయన చెప్పారు. బుధవారం తాను అధికారుల ఎదుట హాజరు కావాల్సి ఉండగా, సమయం కోరినట్లు తెలిపారు. తాను ఏ తప్పు చేయలేదని, ఐటీ అధికారుల ఎదుట హాజరై వివరణ ఇస్తానని ఆయన వెల్లడించారు. సంజయ్ షిర్సాత్‌పై చర్యలు తీసుకోవాలని ఉద్ధవ్ ఠాక్రే కూడా డిమాండ్ చేశారు.
Sanjay Shirsat
Maharashtra Minister
Income Tax Notice
Cash Bag Video
Sanjay Raut

More Telugu News