K Kavitha: బీసీ రిజర్వేషన్లపై మంత్రి చెప్పారు కానీ, కొన్ని అనుమానాలు ఉన్నాయి: కవిత

K Kavitha doubts BC reservations implementation by Congress government
  • ఆర్డినెన్స్ తీసుకు వస్తామని చెప్పినందున రైల్ రోకోను వాయిదా వేస్తున్నట్లు కవిత వెల్లడి
  • ఆర్డినెన్స్ తేవాలనుకుంటే 18 నెలలు ఎందుకు ఆగారని ప్రభుత్వానికి నిలదీత
  • వారం రోజుల పాటు ప్రభుత్వం కార్యాచరణను గమనిస్తామన్న కవిత
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే 42 శాతం బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుకొస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పడం సంతోషకరమని, అయితే తమకు కొన్ని అనుమానాలు ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని తాము స్వాగతిస్తున్నామని, అందుకే ఈ నెల 17న తలపెట్టిన రైల్ రోకో కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ఆమె తెలిపారు.

ఆర్డినెన్స్ జారీ చేసిన వెంటనే రిజర్వేషన్లను అమలు చేయగలిగితే కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలలు ఎందుకు వేచి చూసిందని కవిత ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసమే అలా చేశారని తాము భావిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే రిజర్వేషన్ల చుట్టూ రాజకీయాలు చేస్తోందని ఆమె విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని, దీంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

రాజ్యాంగ సవరణ జరిగితే బీసీలకు రాజకీయంగా హక్కులు లభిస్తాయని కవిత అన్నారు. విద్య, ఉద్యోగాల గురించి కూడా ప్రభుత్వం స్పష్టతనివ్వాలని ఆమె డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని, కాబట్టి తలుచుకుంటే ఒక్క నిమిషంలో రాజ్యాంగ సవరణ చేసి ఇవ్వవచ్చని అన్నారు. కానీ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. తప్పులన్నీ కాంగ్రెస్ పైకి నెట్టి తప్పించుకోవాలని చూస్తున్నారేమోనని ఆరోపించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఆమె అన్నారు.

బీసీ బిల్లును షెడ్యూల్ -9లో పెట్టాలని, దీని కోసం బీసీ బిడ్డ, కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవ తీసుకోవాలని కవిత విజ్ఞప్తి చేశారు. ఆర్డినెన్స్ తీసుకువస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినందున, ఈ వారం రోజులు ప్రభుత్వ కార్యాచరణను గమనించి, అందుకు అనుగుణంగా తాము నిర్ణయం తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.
K Kavitha
BRS
BC Reservations
Telangana Politics
Ponguleti Srinivas Reddy

More Telugu News