Chandrababu Naidu: పీ 4 మార్గదర్శులతో త్వరలో సీఎం చంద్రబాబు భేటీ

Chandrababu Naidu to Meet P4 Guides Soon
  • పీ4 – జీరో పావర్టీ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన సీఎం
  • మార్గదర్శులను ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టాలన్న సీఎం
  • పేదల కోసం పెద్దలను ఆశ్రయిద్దామన్న సీఎం
పీ4 (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్-పార్టనర్‌షిప్) కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కీలక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో మార్గదర్శకులతో సమావేశం కానున్నారు. పీ4 – జీరో పావర్టీ కార్యక్రమంపై నిన్న తన క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పీ4 కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.

ఇప్పటి వరకు ఈ కార్యక్రమంలో మార్గదర్శకులుగా ఉండేందుకు 18,332 మంది ముందుకు వచ్చారు. వీరిలో పారిశ్రామికవేత్తలు, ఎన్నారైలు, ఉన్నత వర్గాల వారు ఉన్నారు. వీరి ద్వారా 1,84,134 బంగారు కుటుంబాలకు చేయూత లభిస్తోంది. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడంతో పాటు మార్గదర్శిగా ఉండేవారిని ప్రోత్సహించేందుకు పలు చర్యలు చేపట్టాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు.

మార్గదర్శులుగా ఉండేవారిని ప్రోత్సహించడానికి స్వయంగా వారితో చంద్రబాబు సమావేశం కానున్నారు. మార్గదర్శులుగా ఉండే 200 మంది టాప్ ఎన్నారైలు, పారిశ్రామికవేత్తలు, భారీ నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఎంఎన్సీ కంపెనీల ప్రతినిధులు, సెలబ్రిటీలతో సీఎం సమావేశం కానున్నారు. ఈ నెల 18వ తేదీన అమరావతిలో వీరిని విందుకు ఆహ్వానించాలనే అంశంపై ఈ సమీక్షలో చర్చ జరిగింది.

పీ4 లక్ష్యాలను వివరించి మరింత మందిని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసేలా ప్రణాళికలను సిద్ధం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. సమాజంలో పేదలకు అండగా ఉండేందుకు సిద్ధంగా ఉన్న అనేక వర్గాల వారిని ఒక తాటిపైకి తెచ్చేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని సీఎం భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రణాళిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
Chandrababu Naidu
P4 program
Andhra Pradesh
Public Private Partnership
Zero Poverty program
NRI
Amaravati
Gold families
AP government
मार्गदर्शक

More Telugu News