Penchala Kishore: విరిగిన పాల వివాదంపై స్పందించిన కాణిపాకం ఆలయ ఈవో

Kanipakam Temple EO Responds to Broken Milk Controversy
  • కాణిపాకంలో విరిగిన పాలతో అభిషేకం అంటూ ప్రచారం
  • సోషల్ మీడియా వార్తలను ఖండించిన ఆలయ ఈవో పెంచుల కిశోర్
  • అవి కేవలం నిరాధారమైన ఆరోపణలని స్పష్టీకరణ
  • ఇద్దరు భక్తులకు టెండర్ దారుడు విరిగిన పాలు ఇచ్చాడని వెల్లడి
  • ఆ పాలను అభిషేకానికి వినియోగించలేదని స్పష్టం
  • అసత్యాలు ప్రచారం చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దని విజ్ఞప్తి
ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి విరిగిన పాలతో అభిషేకం చేశారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) పెంచుల కిశోర్ స్పష్టం చేశారు. వైరల్ అవుతున్న ఈ వార్తలను తాను ఖండిస్తున్నట్టు తెలిపారు. భక్తులు ఇలాంటి నిరాధారమైన వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

ఈ వివాదంపై పెంచుల కిశోర్ పూర్తి వివరాలు వెల్లడించారు. ఆలయంలో పాలు సరఫరా చేసే కాంట్రాక్టర్ పొపాటున ఇద్దరు భక్తులకు విరిగిన పాల ప్యాకెట్లు ఇచ్చారని తెలిపారు. అది గమనించిన ఆ భక్తులు ఆ కాంట్రాక్టర్ తో వాగ్వాదానికి దిగి, ఆ ప్యాకెట్లను అక్కడే వదిలి వెళ్లిపోయారని వివరించారు. ఆ పాలను స్వామివారి అభిషేకానికి ఏమాత్రం వినియోగించలేదని ఆయన తేల్చిచెప్పారు.

ఆలయ అర్చకులు అభిషేకం కోసం వినియోగించే ప్రతి వస్తువును అత్యంత శ్రద్ధగా పరిశీలించిన తర్వాతే స్వామివారికి సమర్పిస్తారని ఈవో గుర్తుచేశారు. కొందరు ఉద్దేశపూర్వకంగా ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని ఆయన కోరారు.
Penchala Kishore
Kanipakam Temple
Broken Milk
Sri Varasiddhi Vinayaka Swamy
Temple EO
Andhra Pradesh Temples
Viral Video
Fake News
Temple Administration
Religious sentiments

More Telugu News