Nara Lokesh: పవన్ ఛాలెంజ్‌కు లోకేశ్ సై.. ఇక విద్యాశాఖ ఆధ్వర్యంలో పచ్చదనం

Nara Lokesh Accepts Pawan Kalyans Challenge Planting Crores of Trees
  • పవన్ కల్యాణ్ విసిరిన సవాల్‌ను స్వీకరించిన మంత్రి నారా లోకేశ్
  • విద్యాశాఖ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటుతామని ప్రకటన
  • అమ్మ పేరుతో మొక్క నాటాలన్న ప్రధాని మోదీ పిలుపునకు స్పందన
  • కొత్తచెరువులో జరిగిన మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్‌లో వెల్లడి
  • ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని హామీ
రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో కోటి మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ సంచలన ప్రకటన చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుతో స్ఫూర్తి పొంది, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విసిరిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి లోకేశ్ "మెగా పీటీఎం-2.0" (తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశం)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని ప్రధాని మోదీ గారు పిలుపునిచ్చారు. దానిని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలో కోటి మొక్కలు నాటాలని పవన్ కల్యాణ్ గారు సవాల్ విసిరారు. ఆ సవాల్‌ను నేను స్వీకరిస్తున్నా. ఒక్క విద్యాశాఖ ద్వారానే ఆ కోటి మొక్కలు నాటి చూపిస్తాం" అని ప్రకటించారు.

ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని లోకేశ్ తెలిపారు. విద్యార్థులకు కేవలం చదువు మాత్రమే కాకుండా ఆటలు, పాటలు, యోగా వంటి వాటిలో కూడా శిక్షణ ఇస్తున్నామని వివరించారు. విద్యార్థుల ఎదుగుదలలో గురువుల పాత్ర ఎంతో కీలకమని, తల్లిదండ్రుల తర్వాత అంతటి ఉన్నత స్థానం వారిదేనని కొనియాడారు. పాఠశాలల్లో ఎలాంటి రాజకీయాలకు తావులేదని, విద్యార్థుల భవిష్యత్తే తమకు ముఖ్యమని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.
Nara Lokesh
Andhra Pradesh
Pawan Kalyan
Chandrababu Naidu
Tree Plantation
Education Department
Mega PTM 2.0
Government Schools
AP Education
Greenery

More Telugu News