Sheikh Hasina: షేక్ హసీనాను అప్పగించండి: భారత్‌కు బంగ్లాదేశ్ ప్రభుత్వం మరోసారి విజ్ఞప్తి

Bangladesh Requests Sheikh Hasina Extradition from India Again
  • భారత్ తన మనస్సాక్షితో వ్యవహరించాలన్న మహ్మద్ యూనస్ ప్రభుత్వం
  • హసీనాపై హత్య, మానవత్వ వ్యతిరేక నేరాల కింద తీవ్ర ఆరోపణలు
  • ఇప్పటికే కోర్టు ధిక్కరణ కేసులో ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష
  • గతేడాది ఆగస్టు నుంచి భారత్‌లోనే తలదాచుకుంటున్న షేక్ హసీనా
  • బాధితులకు న్యాయం జరగాలంటే హసీనాను అప్పగించాలని స్పష్టీకరణ
భారత్‌లో ఆశ్రయం పొందుతున్న తమ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాను వెంటనే తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం మరోసారి విజ్ఞప్తి చేసింది. ఈ విషయంలో భారత్ తన మనస్సాక్షితో వ్యవహరించి సముచిత నిర్ణయం తీసుకోవాలని సూచించింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ కార్యాలయం ఈ మేరకు సామాజిక మాధ్యమం ద్వారా ఒక ప్రకటన విడుదల చేసింది.

"షేక్ హసీనాను అప్పగించాలని మేం పదేపదే అభ్యర్థిస్తున్నప్పటికీ, భారత్ నుంచి స్పందన కరవైంది. ఈ అంశాన్ని మరింత జాప్యం చేయడం సముచితం కాదు" అని యూనస్ ప్రభుత్వం ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. మానవత్వానికి వ్యతిరేకంగా తీవ్ర నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి భారత్ వంటి ప్రజాస్వామ్య దేశం ఆశ్రయం కల్పించడం సబబు కాదని హితవు పలికింది. చట్టం ముందు ఎంతటి శక్తిమంతులైనా సమానులేనని, బాధితులకు న్యాయం జరగాల్సిందేనని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

పౌరులను ఉద్దేశపూర్వకంగా హత్య చేసిన వారిని ప్రాంతీయ బంధాలు లేదా రాజకీయ నేపథ్యం కాపాడలేవని తేల్చి చెప్పారు. చట్టబద్ధ పాలన, ప్రజాస్వామ్య సమగ్రత వంటి ఉమ్మడి విలువల పట్ల భారత్ గౌరవం ప్రదర్శించాలని యూనస్ ఆ ప్రకటనలో కోరారు.

గత సంవత్సరం విద్యార్థుల ఆందోళనల కారణంగా అధికారం కోల్పోయిన షేక్ హసీనా, ఆగస్టు 5 నుంచి భారత్‌లో తలదాచుకుంటున్నారు. నిరసనల సందర్భంగా ఆమె పార్టీ అవామీ లీగ్ మద్దతుదారులు, మైనారిటీ వర్గాలపై దాడులు జరిగాయి. ఈ అల్లర్లలో దాదాపు 1400 మంది మరణించారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. అనంతరం బంగ్లాదేశ్‌లో అధికారంలోకి వచ్చిన యూనస్ ప్రభుత్వం, హసీనాపై హత్యతో సహా పలు కేసులు నమోదు చేసింది. ఇదివరకే ఒక కోర్టు ధిక్కరణ కేసులో అక్కడి అంతర్జాతీయ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో ఆమెను స్వదేశానికి రప్పించేందుకు బంగ్లా ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
Sheikh Hasina
Bangladesh
India
Mohammad Yunus
Extradition

More Telugu News