YS Sharmila: 'బంగారు పాళ్యం వైసీపీ మామిడికాయ సినిమా'ను రక్తి కట్టించారు: షర్మిల

YS Sharmila Criticizes YSRCPs Mango Drama in Bangaru Palem
  • తోతాపురి రైతుల కష్టాలపై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆవేదన
  • కూటమి ప్రభుత్వం మద్దతు ధర కల్పించడంలో విఫలమైందని విమర్శ
  • బంగారుపాళ్యంలో జగన్ పర్యటన ఓ రాజకీయ డ్రామా అని ఆరోపణ
  • జగన్‌కు కూటమి ప్రభుత్వం, పోలీసులు సహకరించారని సంచలన వ్యాఖ్య
  • రైతుల సమస్యపై తక్షణం ఉన్నత స్థాయి కమిటీ వేయాలని డిమాండ్
రాష్ట్రంలో అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య "నువ్వు కొట్టినట్లు చెయ్యి, నేను ఏడ్చినట్లు చేస్తా" అన్నట్లుగా వ్యవహారం నడుస్తోందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శించారు. ఒకవైపు తోతాపురి మామిడి రైతులు ధరలు పతనమై కన్నీరు పెడుతుంటే, మరోవైపు ఈ రెండు పార్టీలు రాజకీయ డ్రామాలకు తెరలేపాయని ఆమె సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు.

బంగారుపాళ్యంలో వైఎస్ జగన్ పర్యటనను ఆమె ఓ పెద్ద నాటకంగా అభివర్ణించారు. కూటమి ప్రభుత్వ దర్శకత్వంలో, పోలీసుల సహకారంతో ఈ "బంగారుపాళ్యం వైసీపీ మామిడికాయ సినిమా"ను రక్తి కట్టించారని ఎద్దేవా చేశారు. పరామర్శల పేరుతో వేలాది మందితో బలప్రదర్శన చేస్తుంటే, ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషించిందని విమర్శించారు. ప్రధాని మోదీకి జగన్ దత్తపుత్రుడు కావడం, వారి మధ్య అక్రమ పొత్తు ఉండటం వల్లే రాష్ట్రంలో ఆయనకు పూర్తి స్వేచ్ఛ లభిస్తోందని, అందుకే ఎలాంటి చర్యలు ఉండటం లేదని షర్మిల సంచలన ఆరోపణలు చేశారు.

తోతాపురి రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని షర్మిల దుయ్యబట్టారు. కిలోకు 16 రూపాయలు ఇస్తే తప్ప తాము కోలుకోలేమని రైతులు వేడుకుంటుంటే, మార్కెట్లో 4 రూపాయలకు మించి ధర పలకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మాత్రం 12 రూపాయలు ఇచ్చి న్యాయం చేశామని అబద్ధాలు చెబుతోందని మండిపడ్డారు.

ఇది రైతుల కోసం జగన్ చేస్తున్న పోరాటం కాదని, కేవలం డబ్బుతో కూడిన బలప్రదర్శన అని షర్మిల స్పష్టం చేశారు. రైతులపై జగన్ కనబరుస్తున్నది ముసలి కన్నీరేనని ఆమె వ్యాఖ్యానించారు. తోతాపురి రైతుల సమస్యలపై తక్షణం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి, శాశ్వత పరిష్కారం చూపాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
YS Sharmila
Andhra Pradesh
YSRCP
TDP
Mango farmers
Bangaru Palem
YS Jagan
AP Congress
Political drama
Totapuri mangoes

More Telugu News