Prabhakar Rao: ఫోన్ ట్యాపింగ్ కేసు: ప్రభాకర్ రావు అరెస్ట్‌పై స్టే ఎత్తివేయాలని సుప్రీంకోర్టుకు సిట్

SIT Appeals to Supreme Court to Revoke Stay on Prabhakar Raos Arrest
  • ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
  • ఢిల్లీకి చేరుకున్న సిట్ ప్రత్యేక బృందం
  • ప్రభాకర్ రావుకు ఇచ్చిన మినహాయింపు రద్దుకు పిటిషన్
  • విచారణకు ఆయన సహకరించడం లేదని ఆరోపణ
  • కస్టోడియల్ విచారణకు అనుమతి కోరనున్న అధికారులు
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విషయంలో సిట్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు సుప్రీంకోర్టు ఇచ్చిన మినహాయింపులను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ బాట పట్టారు.

ఈ కేసు విచారణలో భాగంగా వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరితో కూడిన సిట్ బృందం ఢిల్లీకి చేరుకుంది. ప్రభాకర్ రావు విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని, ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారిస్తేనే కీలక వాస్తవాలు వెలుగులోకి వస్తాయని సిట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన అరెస్ట్‌పై ఉన్న స్టేను ఎత్తివేయాలని కోరుతూ గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమైంది.

ఇప్పటికే ఐదుసార్లుగా దాదాపు 40 గంటల పాటు ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నించారు. అయితే, ప్రతిసారీ ఆయన పొంతనలేని సమాధానాలు ఇస్తూ దర్యాప్తును తప్పుదోవ పట్టిస్తున్నారని అధికారులు పేర్కొంటున్నారు. పై అధికారుల ఆదేశాల ప్రకారమే తాను నడుచుకున్నానని ఆయన చెబుతుండగా, ఆయన ఆదేశాలతోనే తాము ఫోన్ ట్యాపింగ్ చేశామని ఇప్పటికే అరెస్టయిన ఇతర నిందితులు వాంగ్మూలం ఇచ్చారు.

ఈ వైరుధ్యాల నేపథ్యంలో, ఆగస్టు 5 వరకు ప్రభాకర్ రావును అరెస్ట్ చేయరాదన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను రద్దు చేయించడం ద్వారా, కస్టోడియల్ విచారణకు మార్గం సుగమం చేసుకోవాలని సిట్ అధికారులు యోచిస్తున్నారు. 
Prabhakar Rao
Phone tapping case
Telangana phone tapping
Telangana SIB
Special Investigation Team SIT
Telangana politics
Telangana news
Supreme Court
Telangana government

More Telugu News