Tahawwur Rana: 26/11 ముంబై దాడుల కేసు.. తహవర్‌ రాణాకు మరోసారి కస్టడీ పొడిగింపు

Delhi court extends 2611 terror attack accused Tahawwur Ranas judicial custody till August 13
  • 26/11 ముంబై ఉగ్రదాడి కేసులో నిందితుడు తహవర్ రాణా
  • ఆగస్టు 13 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించిన ఢిల్లీ కోర్టు
  • రాణాపై అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ
  • దాడితో తనకు ఎలాంటి సంబంధం లేదని విచారణలో వెల్లడి
  • రెక్కీ, ప్రణాళిక అంతా హెడ్లీదేనని ఆరోపణ
26/11 ముంబై ఉగ్రదాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తహవర్ రాణా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు మరోసారి పొడిగించింది. బుధవారం ముగిసిన కస్టడీ గడువు నేపథ్యంలో రాణాను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కోర్టు ముందు హాజరుపరచగా, ఆగస్టు 13 వరకు కస్టడీని పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

ఈ కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఇటీవల రాణాపై అనుబంధ ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. దర్యాప్తులో భాగంగా సహ నిందితుడు డేవిడ్ కోల్‌మన్‌ హెడ్లీతో రాణా జరిపిన టెలిఫోన్ సంభాషణల రికార్డింగ్‌లతో సరిపోల్చేందుకు అధికారులు ఇప్పటికే రాణా గొంతు, చేతిరాత నమూనాలను సేకరించారు. దాడుల కోసం లక్ష్యాలను ఎంపిక చేసేందుకు హెడ్లీకి అవసరమైన మ్యాప్‌లు, సూచనలతో కూడిన చేతిరాత నోట్లను రాణానే అందించాడని ఎన్‌ఐఏ అనుమానిస్తోంది.

అయితే, ఎన్‌ఐఏ విచారణలో రాణా తనపై ఉన్న ఆరోపణలను పూర్తిగా ఖండించాడు. ముంబై దాడుల ప్రణాళికతో గానీ, వాటిని అమలు చేయడంతో గానీ తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నాడు. తన చిన్ననాటి స్నేహితుడైన హెడ్లీనే రెక్కీ, ప్రణాళిక మొత్తం చూసుకున్నాడని, ఈ దాడికి పూర్తి బాధ్యత అతడిదేనని రాణా తెలిపాడు. విచారణ సమయంలో తాను ముంబై, ఢిల్లీతో పాటు కేరళకు కూడా వెళ్లినట్లు అంగీకరించాడు. ఒక పరిచయస్తుడిని కలిసేందుకే కేరళ వెళ్లినట్లు చెప్పి, ఆ వ్యక్తి వివరాలను అధికారులకు అందించాడు.

పాకిస్థాన్ సైన్యంలో వైద్యుడిగా పనిచేసిన రాణాను, ఈ కేసులో విచారణ నిమిత్తం అమెరికా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన‌ విషయం తెలిసిందే.
Tahawwur Rana
Mumbai attacks
26/11 Mumbai terror attack
David Headley
NIA investigation
Patiala House Court
judicial custody
India
Pakistan
terrorism

More Telugu News