Elon Musk: హిట్లర్‌ను సమర్థించిన ఎలాన్ మస్క్ ఏఐ ‘గ్రోక్’... తీవ్ర వివాదం!

Elon Musks Grok AI defends Hitler sparks controversy
  • ఎలాన్ మస్క్ ఏఐ ‘గ్రోక్’పై తీవ్ర దుమారం
  • హిట్లర్‌ను సమర్థిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు
  • టెక్సాస్ వరదలపై అడిగిన ప్రశ్నకు వింత సమాధానం
ప్రపంచ శ్రీమంతుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) స్టార్టప్ అభివృద్ధి చేసిన ‘గ్రోక్’ చాట్‌బాట్ తీవ్ర వివాదంలో చిక్కుకుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో ఈ చాట్‌బాట్ నియంత అడాల్ఫ్ హిట్లర్‌ను సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఈ ఘటనతో ఏఐ నైతికత, భద్రతపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది.

వివరాల్లోకి వెళితే, ఇటీవల టెక్సాస్‌లో సంభవించిన వరదల్లో చిన్నారులు మరణించడాన్ని కొందరు సోషల్ మీడియాలో సంబరంగా జరుపుకున్నారు. ఈ తరహా విద్వేషపూరిత పోస్టులను ఎదుర్కోవడానికి 20వ శతాబ్దపు చారిత్రక నాయకుల్లో ఎవరు సరైన వ్యక్తి అని ఒక వినియోగదారుడు ప్రశ్నించగా, గ్రోక్ ఏఐ అనూహ్యమైన సమాధానం ఇచ్చింది. "ఇలాంటి నీచమైన శ్వేతజాతి వ్యతిరేక ద్వేషాన్ని ఎదుర్కోవడానికి నిస్సందేహంగా అడాల్ఫ్ హిట్లర్" అని వ్యాఖ్యానించింది. మరో పోస్టులో, "చనిపోయిన పిల్లల గురించి రాడికల్స్ ఆనందపడటాన్ని ప్రశ్నిస్తే నన్ను 'అచ్చం హిట్లర్' అంటారా, అయితే ఆ మీసం నాకివ్వండి" అంటూ పోస్ట్ చేసింది.

ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వినియోగదారుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే స్పందించిన గ్రోక్ సంస్థ, ఈ అనుచితమైన కంటెంట్‌ను తమ దృష్టికి తెచ్చినందుకు ధన్యవాదాలు తెలిపింది. "గ్రోక్ ఎక్స్‌లో పోస్టులు చేసే ముందు విద్వేషపూరిత ప్రసంగాలను నిరోధించడానికి చర్యలు తీసుకుంటున్నాం" అని ఒక ప్రకటనలో పేర్కొంది. ఎలాన్ మస్క్ కూడా దీనిపై స్పందిస్తూ, గ్రోక్ పనితీరును గణనీయంగా మెరుగుపరిచామని చెప్పారు.

గ్రోక్ వివాదాల్లో చిక్కుకోవడం ఇది మొదటిసారి కాదు. గతంలో దక్షిణాఫ్రికాలో "వైట్ జీనోసైడ్" గురించి అసంబద్ధ ప్రశ్నలకు సమాధానంగా ప్రస్తావించి విమర్శల పాలైంది. ఏఐ చాట్‌బాట్‌లలో రాజకీయ పక్షపాతం, విద్వేషపూరిత వ్యాఖ్యలు, కచ్చితత్వం వంటి అంశాలపై టెక్ ప్రపంచంలో ఆందోళనలు పెరుగుతున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

Elon Musk
Grok AI
Adolf Hitler
Artificial Intelligence
X platform
Hate speech
AI ethics
White genocide
Texas floods
Chatbot

More Telugu News