Chandrababu Naidu: నీటి విలువ తెలిసిన వాణ్ని కాబట్టే కృష్ణమ్మకు హారతి ఇచ్చా: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Offers Prayers to Krishna River at Srisailam
  • నిండిన శ్రీశైలం రిజర్వాయర్
  • నేడు శ్రీశైలంలో సీఎం చంద్రబాబు పర్యటన
  • కృష్ణా జలాలకు హారతి ఇచ్చి గేట్లు ఎత్తిన వైనం
  • నీటి వినియోగదారులతో సమావేశం
"పూర్వీకులు మనకి సనాతన ఆలయాల్ని వారసత్వంగా ఇచ్చారు. కానీ అందరికీ అవసరమైన ఆధునిక దేవాలయాలు రిజర్వాయర్లు, జలాశయాలు. అటువంటి ఆధునిక దేయాలయాలను రాష్ట్రంలో అత్యధికంగా నిర్మించే అవకాశాన్ని నాకు భగవంతుడు కల్పించాడు. నీటి విలువ తెలిసిన వాణ్ని కాబట్టే కృష్ణమ్మకు హారతి ఇచ్చా. జలాలే మన సంపద.. వాటితోనే రైతుల కష్టాలు తీరతాయి" అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శ్రీశైలంలో కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన అనంతరం ప్రాజెక్టు గేట్లు నాలుగు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. అనంతరం నీటి వినియోగదారులతో సమావేశమై ప్రసంగించారు. 

గంగమ్మను పూజిస్తే కరవు ఉండదు

భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుని నా సంకల్పం నెరవేరాలని మొక్కుకున్నా. రాయలసీమ రతనాలసీమగా మార్చాలని వేడుకున్నాను. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నాను. నీళ్లు మన సంపద... జలాలుంటే సందప సృష్టించుకోవచ్చు. శ్రీశైలం పవిత్రమైన పుణ్యక్షేత్రం... శక్తి పీఠం. మల్లికార్జున స్వామి చల్లగా చూసినన్ని రోజులు రాయలసీమ సుభిక్షంగా ఉంటుంది. శ్రీశైలం పేరు వినగానే మల్లన్న, రిజర్వాయర్ గుర్తొస్తాయి. దేవుణ్ని పవిత్రంగా ప్రార్థించిన విధంగానే నీళ్లను కూడా పూజిస్తే రైతులకు కష్టాలు ఉండవు. గతంలో కరవు వల్ల రాయలసీమను ఎవరూ కాపాడలేరు, రాళ్లసీమగా మారుతుందని ఆశలు వదలుకున్నాం. కానీ సంకల్పం ఉంటే ఏదైనా చేయొచ్చని ఎన్టీఆర్ నిరూపించారు. రతనాల సీమగా చేస్తానని చెప్పి ఉక్కు సంకల్పంతో ముందుకెళుతున్నాం.

రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలి

నేను రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలని కోరుకుంటా. ఉమ్మడి రాష్ట్రం, విభజన తర్వాత కూడా నాకు ఇచ్చిన గౌరవం చరిత్రలో ఎవరికీ దక్కదు. సమైక్య రాష్ట్రంలో 9 ఏళ్లు సీఎంగా, 10 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నాను. విభజన తర్వాత రెండవ సారి ముఖ్యమంత్రి అయ్యాను. ప్రపంచంలోనే తెలుగుజాతి నెంబర్-1గా ఉండాలనేది నా అభిమతం. గత ప్రభుత్వం ఐదేళ్లు రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది. చెడిపోయిన వ్యవస్థలను సరిచేస్తున్నా. అయినా 24 గంటల సమయం సరిపోవడం లేదు. వరదల సమయంలో సముద్రంలోకి నీళ్లు వృధాగా పోతున్నాయి. వాటిని సమర్థవంతంగా వినియోగించుకుంటే రైతులకు మేలు జరుగుతుంది. 

పోలవరం వల్లే సీమకు నీళ్లు

2027 నాటికి పోలవరం పూర్తవుతుంది. 2019లో నేను మళ్లీ ముఖ్యమంత్రిని అయ్యుంటే ప్రాజెక్టును జాతికి అంకితం చేసేవాళ్లం. పోలవరం కుడి కాలువ వల్లే నేడు సీమకు నీళ్లు వస్తున్నాయి. కృష్ణా డెల్టాకు కృష్ణా నీళ్లు కాకుండా...గోదావరి నీళ్లు వాడుతున్నాం. కృష్ణా డెల్టాకు గోదావరి నీళ్లు 120 టీఎంసీలు వాడి...ఆ మిగులు జలాలను సీమకు ఇస్తున్నాం. పోలవరం...ఏపీకి వరం. గోదావరి నుంచి 2 వేల టీఎంసీల నీరు ఏటా సముద్రంలో కలుస్తోంది. అందులో 200 టీఎంసీలు ఏపీ వాడుకున్నా, 100 నుంచి 200 టీఎంసీలు తెలంగాణ వాడుకున్నా రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయి. దిగువన మనం...ఎగువన తెలంగాణ నీటిని వాడుకోవచ్చు... అని సీఎం చంద్రబాబు వివరించారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Srisailam
Krishna River
Polavaram Project
Rayalaseema
Water Resources
Irrigation Projects
Telugu States
River Water Sharing

More Telugu News