Aakash Deep: సంచలన పేసర్ ఆకాశ్ దీప్ గురించి సోదరి జ్యోతి ఏమన్నారంటే..!

Aakash Deeps Sister Akhand Jyoti Singh Shares Emotional Story
  • క్యాన్సర్‌తో పోరాడుతున్న క్రికెటర్ ఆకాశ్ దీప్ సోదరి అఖండ్ జ్యోతి
  • ఏప్రిల్ 2025లో స్టేజ్ 3 క్యాన్సర్‌గా నిర్ధారణ
  • ఐపీఎల్ ఆడుతూనే రోజూ ఆసుపత్రికి వచ్చి పరామర్శించిన ఆకాశ్ దీప్
  • నా గురించి తమ్ముడు చాలా ఆందోళన చెందాడన్న సోదరి
  • చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఆకాశ్ దీప్‌కు ప్రాణం అని వెల్లడి
  • క్రికెట్ కోసం బెంగాల్ వెళ్లి సొంతంగా ఎదిగాడని గర్వంగా చెప్పిన సోదరి
టీమిండియా యువ పేసర్ ఆకాశ్ దీప్ తన అద్భుత ప్రదర్శనతో అందరి మన్ననలు పొందుతుండగా, అతని సోదరి అఖండ్ జ్యోతి సింగ్ తన తమ్ముడి గురించి పలు భావోద్వేగ విషయాలు పంచుకున్నారు. ప్రస్తుతం లక్నోలో నివసిస్తున్న ఆమె, స్టేజ్ 3 పెద్దప్రేగు క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ఈ కష్ట సమయంలో తన సోదరుడు ఆకాశ్ తనకు ఎంతగానో అండగా నిలిచాడని ఆమె గుర్తుచేసుకున్నారు.

"2025 ఏప్రిల్‌లో నాకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆ సమయంలో ఆకాశ్ ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్నాడు. నా ప్రేగుల్లో క్యాన్సర్ ఉండటంతో సర్జరీ చేయాల్సి వచ్చింది. ఆ రోజుల్లో ఆకాశ్ తన ప్రాక్టీస్ ముగిసిన వెంటనే ప్రతిరోజూ నన్ను చూసేందుకు ఆసుపత్రికి వచ్చేవాడు. నా ఆరోగ్యం గురించి అతను చాలా ఆందోళన చెందాడు. నాకు అండగా నిలబడ్డాడు" అని అఖండ్ జ్యోతి తెలిపారు. లక్నోలో నివసిస్తున్న ఆమె భర్త ఒక ప్రభుత్వ బ్యాంకులో పనిచేస్తున్నారు.

ఆకాశ్ దీప్ చిన్ననాటి రోజులను గుర్తుచేసుకుంటూ, "మా నాన్న ఒక ఉపాధ్యాయుడు. ఆకాశ్ బాగా చదువుకోవాలని ఆయన కోరుకునేవారు. కానీ నా తమ్ముడికి మాత్రం క్రికెట్ అంటేనే ప్రాణం. టోర్నమెంట్‌లకు వెళ్లే ముందు మా దగ్గర డబ్బులు అడిగి తీసుకునేవాడు. గెలిచిన తర్వాత తిరిగి ఇచ్చేసేవాడు. అప్పట్లో బీహార్ క్రికెట్ బోర్డుపై రంజీ ట్రోఫీలో నిషేధం ఉండటంతో, అతను తన కలను సాకారం చేసుకునేందుకు బెంగాల్‌కు వెళ్ళిపోయాడు. అక్కడ స్థానిక మ్యాచ్‌లు ఆడుతూ తన ఖర్చులను తనే చూసుకున్నాడు" అని ఆమె వివరించారు. కష్టకాలంలోనూ తమ్ముడు చూపిన ధైర్యం, క్రికెట్ పట్ల అతనికున్న అంకితభావం తనకెంతో గర్వకారణమని అఖండ్ జ్యోతి సింగ్ అన్నారు.

"ఇంగ్లండ్ పర్యటనకు ముందు నేను బాగానే ఉన్నానని, దేశం కోసం ఆడటంపైనే దృష్టి పెట్టమని ఆకాశ్‌దీప్‌కు చెప్పాను. అతను నా గురించి బహిరంగంగా మాట్లాడతాడని అస్సలు ఊహించలేదు. ఈ విషయం బయటకు చెప్పాలనుకోలేదు, కానీ అతను భావోద్వేగంతో చెప్పేశాడు. మాపై తనకున్న ప్రేమను చూసి సంతోషంగా అనిపించింది" అని జ్యోతి సింగ్ వివరించారు.
Aakash Deep
Akhand Jyoti Singh
Indian cricketer
IPL 2025
Lucknow Super Giants
Cancer survivor
Bihar cricket
Bengal cricket
Ranjhi trophy
family support

More Telugu News