భద్రాచలం ఆలయ ఈవోపై దాడి.. స్పృహ కోల్పోయిన రమాదేవి
- పురుషోత్తపట్నంలో ఆలయ భూముల అంశంపై ఘర్షణ
- ఆలయ భూముల్లో ఆక్రమణలను ఈవో అడ్డుకోవడంతో గ్రామస్థుల దాడి
- దాడిలో స్పృహ కోల్పోయిన మహిళా అధికారి
- భద్రాచలం ఆస్పత్రికి తరలించి చికిత్స
- హైకోర్టు ఆదేశాలను లెక్కచేయని ఆక్రమణదారులు
పురుషోత్తపట్నం గ్రామంలో భద్రాద్రి రామాలయానికి చెందిన సుమారు 889.50 ఎకరాల భూమి ఉంది. ఈ భూములను దేవస్థానానికి అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలోనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే, కొందరు వ్యక్తులు కోర్టు ఉత్తర్వులను ఖాతరు చేయకుండా ఆ భూముల్లో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు.
సమాచారం అందుకున్న ఈవో రమాదేవి, ఇతర ఆలయ సిబ్బందితో కలిసి మంగళవారం ఆ ప్రాంతానికి చేరుకుని నిర్మాణాలను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఆక్రమణదారులకు, ఆలయ సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ తోపులాటలోనే ఈవో రమాదేవిపై దాడి జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆలయ భూముల పరిరక్షణకు వెళ్లిన మహిళా అధికారిపై దాడి జరగడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.