Lucy White: భారత్, ఆసియా సిబ్బందిని ఇక్కడి నుంచి పంపించివేయండి: లండన్‌లో మహిళ జాతి వివక్ష వ్యాఖ్యలు

Lucy White Heathrow Airport racism row
  • లండన్ హీత్రూ ఎయిర్‌పోర్ట్ సిబ్బందిపై ఓ బ్రిటిష్ మహిళ వివాదాస్పద వ్యాఖ్యలు
  • ఎయిర్‌పోర్ట్ సిబ్బందిలో ఎక్కువ మంది భారత్, ఆసియా దేశాల వారని ఆరోపణ
  • వారికి ఇంగ్లీష్ ఒక్క ముక్క కూడా రావడం లేదని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్
  • ఇంగ్లీష్ రాని వారిని దేశం నుంచి బహిష్కరించాలంటూ పిలుపు
  • మహిళ వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహం, జాతి వివక్ష అంటూ విమర్శలు
లండన్‌లోని హీత్రూ విమానాశ్రయ సిబ్బందిపై ఒక బ్రిటిష్ మహిళ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. విమానాశ్రయంలో పనిచేస్తున్న ఆసియా, భారతీయ సిబ్బందికి ఆంగ్లం మాట్లాడటం రావడం లేదంటూ ఆమె చేసిన ఆరోపణలు సామాజిక మాధ్యమాల్లో చర్చకు దారితీశాయి. నెటిజన్లు ఆమెపై జాతి వివక్ష ఆరోపణలతో తీవ్రంగా స్పందిస్తున్నారు.

లూసీ వైట్ అనే మహిళ సోమవారం 'ఎక్స్' వేదికగా ఒక పోస్ట్ చేశారు. "తాను ఇప్పుడే హీత్రూ విమానాశ్రయంలో దిగాను. ఇక్కడి సిబ్బందిలో అత్యధికులు భారత్, ఆసియాకు చెందిన వారే ఉన్నారు. వారికి ఒక్క ఆంగ్ల పదం కూడా మాట్లాడటం రావడం లేదు" అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు.

ఆంగ్లంలో మాట్లాడమని అడిగితే తనపైనే జాతి వివక్ష ముద్ర వేయడానికి ప్రయత్నించారని ఆమె ఆరోపించారు. ఇలాంటి వారిని దేశం నుంచి పంపించాలని ఆమె అన్నారు. ఆంగ్లం రాని వారిని విమానాశ్రయంలో ఉద్యోగాల్లో ఉంచడం వల్ల పర్యాటకులు తీవ్ర అసౌకర్యానికి గురవుతారని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ పోస్ట్ వెంటనే వైరల్ కావడంతో, నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

కొందరు ఆమెకు మద్దతు తెలుపుతున్నప్పటికీ, ఎక్కువ మంది ఆమెను జాత్యహంకారిగా అభివర్ణిస్తూ విమర్శలు చేస్తున్నారు. "విమానాశ్రయ సిబ్బందికి ఆంగ్లం రాకపోతే వారు చెప్పిన సమాధానాలు మీకు ఎలా అర్థమయ్యాయి? మీది పూర్తిగా కట్టుకథ" అని ఒకరు పేర్కొనగా, "హీత్రూలో పనిచేసే ఆసియా సిబ్బంది అందరూ ఆంగ్లం అనర్గళంగా మాట్లాడగలరు" అని మరొక నెటిజన్ వ్యాఖ్యానించారు.
Lucy White
Heathrow Airport
racism
racial discrimination
London
Asian employees

More Telugu News