Ethan Guowei: యువ పైలెట్ అత్యుత్సాహం... అరెస్ట్

American Pilot Ethan Guowei Detained in Chile After Antarctica Landing Without Permission
  • ఏడు ఖండాలు చుట్టేయడానికి బయల్దేరిన 19 ఏళ్ల అమెరికన్ పైలట్
  • అనుమతి లేకుండా అంటార్కిటికాలో విమానం దించిన వైనం
  • నిబంధనలు ఉల్లంఘించడంతో అదుపులోకి తీసుకున్న చిలీ అధికారులు
  • ఇప్పటికే 140 రోజుల్లో ఆరు ఖండాలు పూర్తి చేసిన పైలట్
  • క్యాన్సర్ బాధితులకు విరాళాల కోసమే ఈ యాత్ర అని న్యాయవాది వెల్లడి
  • అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘన కింద జైలు శిక్ష పడే అవకాశం
ఏడు ఖండాలను చుట్టి రావాలన్న ఉత్సాహంతో ఒంటరిగా విమాన యాత్రకు బయల్దేరిన ఆసియా సంతతికి చెందిన ఓ అమెరికన్ యువ పైలట్‌ ప్రయత్నం అర్ధాంతరంగా ముగిసింది. అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించి, ఎలాంటి అనుమతి లేకుండా అంటార్కిటికాలో ల్యాండ్ అవ్వడంతో చిలీ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళితే, అమెరికాకు చెందిన 19 ఏళ్ల ఈథన్‌ గువ్‌, సెస్నా-182 విమానంలో ఒంటరిగా ప్రపంచ యాత్ర చేపట్టాడు. ఇప్పటికే 140 రోజుల పాటు ప్రయాణించి ఆరు ఖండాలను పూర్తిచేశాడు. తన ప్రయాణంలో చివరిదైన ఏడో ఖండం అంటార్కిటికాకు చేరుకునే క్రమంలో, అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి, అనుమతులు లేకుండా అక్కడ విమానాన్ని దించాడు. పుంటా అరీనాస్ నగరం మీదుగా వెళుతున్నట్లు తప్పుడు ప్రయాణ ప్రణాళికను సమర్పించి తప్పుదోవ పట్టించినట్లు చిలీ సివిల్ ఏవియేషన్ అధికారులు తెలిపారు.

ఈథన్‌ చర్యల వల్ల అంటార్కిటికా, మగల్లన్స్ ప్రాంతాల్లో విమానయాన భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లిందని అధికారులు పేర్కొన్నారు. అంతర్జాతీయ గగనతల నిబంధనలను ఉల్లంఘించినందుకు అతనికి జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే, ఈ ప్రయాణం వెనుక ఓ సేవా దృక్పథం ఉందని ఈథన్‌ తరఫు న్యాయవాది చెబుతున్నారు. క్యాన్సర్ బాధితుల కోసం విరాళాలు సేకరించేందుకే అతను ఏడు ఖండాల యాత్రకు శ్రీకారం చుట్టారని వివరించారు. ఈ వాదనను అధికారులు ఏ మేరకు పరిగణనలోకి తీసుకుంటారన్నది వేచి చూడాలి.
Ethan Guowei
American pilot
Antarctica
illegal landing
arrest
aviation rules violation
world tour
cancer charity
Chile authorities
Asia origin

More Telugu News