Air India Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ప్రభుత్వానికి చేరిన కీలక నివేదిక.. వీడనున్న మిస్టరీ!

Air India Crash Preliminary Report Submitted To Centre Public Release Soon
  • 241 మంది మృతికి కారణాలపై కొనసాగుతున్న దర్యాప్తు
  • విమానం బ్లాక్ బాక్స్‌ల డేటాను విశ్లేషిస్తున్న అధికారులు
  • రెండు ఇంజిన్లు ఒకేసారి ఆగిపోవడంపై ప్రధానంగా దృష్టి
  • ఈ వారంలోనే నివేదికను ప్రజలకు విడుదల చేసే అవకాశం
దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. ఈ ఘోర దుర్ఘటనకు సంబంధించిన ప్రాథమిక నివేదికను ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు సమర్పించింది. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సహా 241 మందిని బలిగొన్న ఈ ప్రమాదంపై దర్యాప్తు బృందం తన ప్రాథమిక అంచనాలను ఈ నివేదికలో పొందుపరిచింది.

గత నెల జూన్ 12న అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన ఈ విమానం, టేకాఫ్ అయిన కేవలం 32 సెకన్లకే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలోని ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది, ప్రయాణికులు సహా 241 మంది సజీవ దహనమయ్యారు. అదృష్టవశాత్తు సీటు నంబర్ 11ఏలో కూర్చున్న ఒక్క ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు.

ప్రమాదానికి గల కారణాలను ఛేదించేందుకు అధికారులు ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రమాద స్థలంలో లభ్యమైన కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్), ఫ్లైట్ డేటా రికార్డర్ (ఎఫ్‌డీఆర్)లను విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా విమానం టేకాఫ్ అయ్యే కీలక సమయంలో పైలట్లు ప్రమాదవశాత్తు ఫ్యూయల్ స్విచ్‌లను ఆఫ్ చేశారా? అనే కోణంలో దర్యాప్తు బృందాలు దృష్టి సారించాయి. బ్లాక్ బాక్స్‌ల డేటాను, విమాన శకలాల్లో లభించిన ఫ్యూయల్ స్విచ్‌ల భాగాలను పోల్చి చూస్తున్నారు.

అదే సమయంలో రెండు ఇంజిన్లు ఒకేసారి ఫెయిల్ అయ్యాయా? అనే కోణంలో కూడా విచారణ జరుగుతోంది. విమానం 400 అడుగుల కంటే తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు రెండు ఇంజిన్లు ఆగిపోతే ఎలా స్పందించాలనే దానిపై పైలట్లకు శిక్షణ ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు అధికారులు సమర్పించిన నివేదిక కీలకంగా మారింది. ఈ వారంలోనే ఈ నివేదికను ప్రజలకు విడుదల చేయనున్నట్లు, దాని ద్వారా ప్రమాద కారణాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు.
Air India Crash
Vijay Rupani
Ahmedabad plane crash
Air India 171
AAIB report
flight accident investigation
Sardar Vallabhbhai Patel Airport
aircraft accident
fuel switch
cockpit voice recorder
flight data recorder

More Telugu News