TTD: టీటీడీ మరో కీలక నిర్ణయం.. ఇకపై శ్రీవారి భక్తులకు 'పుస్తక ప్రసాదం'

TTD Introduces Book Prasadam for Devotees Visiting Tirumala
  • టీటీడీ ఆధ్వర్యంలో సరికొత్త కార్యక్రమం 'పుస్తక ప్రసాదం'
  • శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక గ్రంథాల పంపిణీ
  • దాతల సహకారంతో పుస్తకాల ముద్రణ, వితరణ
  • వెనుకబడిన ప్రాంతాలు, మత్స్యకార గ్రామాల్లోనూ పంపిణీకి ప్రణాళిక
  • ప్రజల్లో హిందూ ధర్మంపై అవగాహన పెంచడమే ప్రధాన లక్ష్యం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తుల కోసం మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు లడ్డూ ప్రసాదంతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచేందుకు 'పుస్తక ప్రసాదం' అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

హిందూ ధర్మప్రచార పరిషత్ (హెచ్‌డీపీపీ) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారి మహత్యాలు, ఇతర దేవతామూర్తుల స్తోత్రాలు, భజనలు, పవిత్ర గాథలు, భగవద్గీత వంటి పుస్తకాలను భక్తులకు అందించనున్నారు. దాతల నుంచి అందే విరాళాలతో ఈ పుస్తకాలను ముద్రించి, పంపిణీ చేయాలనే అంశాన్ని టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు పరిశీలిస్తున్నారు.

మొదటి దశలో తిరుమలకు విచ్చేసే భక్తులకు ఈ పుస్తక ప్రసాదాన్ని అందజేస్తారు. అనంతరం రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలు, వెనుకబడిన గ్రామాలు, మత్స్యకార గ్రామాల్లో నివసించే ప్రజలకు కూడా వీటిని పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తద్వారా ప్రజలలో హిందూ ధర్మంపై అవగాహన కల్పించి, వారిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని టీటీడీ వర్గాలు వెల్లడించాయి.
TTD
Tirumala Tirupati Devasthanam
Book Prasadam
Hindu Dharma Prachara Parishad
Lord Venkateswara
Spiritual Books
Bhagavad Gita
BR Naidu
Tirumala
Hinduism

More Telugu News