Donald Trump: అమెరికాలో మూడో పార్టీ.. మస్క్ నిర్ణయం 'హాస్యాస్పదం' అన్న ట్రంప్

Donald Trump calls Elon Musks third party idea ridiculous
  • 'అమెరికా పార్టీ' పేరుతో మస్క్ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు 
  • మస్క్ నిర్ణయం హాస్యాస్పదమంటూ కొట్టిపారేసిన ట్రంప్
  • మస్క్ దారితప్పి 'ట్రైన్ వ్రెక్కర్‌'గా మారారంటూ తీవ్ర విమర్శ
  • ఒకప్పటి మిత్రుల మధ్య మరింత ముదిరిన‌ విభేదాలు
ఒకప్పుడు తన ఆప్తమిత్రుడిగా, ప్రభుత్వంలో కీలక సలహాదారుగా ఉన్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మస్క్ కొత్తగా రాజకీయ పార్టీ పెట్టాలన్న నిర్ణయంపై మండిపడిన ట్రంప్, ఆ ఆలోచన 'హాస్యాస్పదం' అని కొట్టిపారేశారు. వారిద్దరి మధ్య ఉన్న విభేదాలు ఈ వ్యాఖ్యలతో మరింత ముదిరాయి.

ఆదివారం న్యూజెర్సీ నుంచి వాషింగ్టన్‌కు విమానంలో బయలుదేరే ముందు ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. "అమెరికాలో ఎప్పటినుంచో రెండు పార్టీల వ్యవస్థే ఉంది. ఇప్పుడు మూడో పార్టీని ప్రారంభించడం గందరగోళాన్ని సృష్టించడం తప్ప మరొకటి కాదు. ఇలాంటివి ఎప్పుడూ విజయవంతం కాలేదు" అని ఆయన అన్నారు. అంతటితో ఆగకుండా తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో స్పందిస్తూ, "గత ఐదు వారాలుగా మస్క్ పూర్తిగా దారితప్పి, ఒక 'ట్రైన్ వ్రెక్కర్‌'గా మారడం చూస్తుంటే బాధగా ఉంది" అని ట్రంప్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇక‌, శనివారం రోజున ఎలాన్ మస్క్ 'అమెరికా పార్టీ' పేరుతో ఒక కొత్త రాజకీయ శక్తిని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన విష‌యం తెలిసిందే. దేశాన్ని అప్పులపాలు చేయడంలో రిపబ్లికన్లు, డెమొక్రాట్లు ఇద్దరూ ఒక్కటేనని, అమెరికాలో ప్రజాస్వామ్యం కాకుండా 'ఏక పార్టీ వ్యవస్థ' నడుస్తోందని ఆయన తన 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) ఖాతాలో విమర్శించారు. ముఖ్యంగా ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన భారీ వ్యయ బిల్లును ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
Donald Trump
Elon Musk
America Party
US Politics
Third Party
Republican Party
Democratic Party
Truth Social
X Twitter
US Elections

More Telugu News