Shruti: భువనగిరిలో ఘోరం: రైలుకు ఎదురెళ్లి ప్రేమజంట ఆత్మహత్య

Love couple suicide in Yadadri Bhuvanagiri district
  • పెద్దలు ఒప్పుకోలేదని ప్రేమజంట ఆత్మహత్య
  • మృతులు జనగామ జిల్లా నమిలిగొండ వాసులు
  • కులాలు వేరు కావడమే పెళ్లికి అడ్డంకి
పెళ్లి చేసుకుని కలిసి బతకాలనుకున్న వారి ఆశలు అడియాసలయ్యాయి. కులాంతర వివాహానికి కుటుంబ సభ్యులు నిరాకరించడంతో మనస్తాపం చెందారు. కలిసి బతకలేకపోయినా, కలిసి చనిపోవాలని నిర్ణయించచుకున్నారు. రైలుకు ఎదురెళ్లి తనువులు చాలించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిందీ ఘటన.

రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం నమిలిగొండ గ్రామానికి చెందిన కొటె వినయ్‌కుమార్‌ (25), అదే గ్రామానికి చెందిన శ్రుతి (23) చిన్నప్పటి నుంచి ఒకరికొకరు తెలుసు. పక్కపక్క ఇళ్లలో నివసించే వీరి స్నేహం కాలక్రమేణా ప్రేమగా మారింది. గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శ్రుతి ఇంజినీరింగ్‌ పూర్తిచేసి హైదరాబాద్‌లో తన సోదరి వద్ద ఉంటూ ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, వినయ్‌కుమార్‌ డిగ్రీ చదివి జనగామలోని ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్నాడు.

జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకున్న వినయ్, శ్రుతి తమ పెళ్లి విషయాన్ని ఇరు కుటుంబాల పెద్దలకు తెలియజేశారు. అయితే, వారి కులాలు వేర్వేరు కావడంతో పెద్దలు ఈ వివాహానికి ససేమిరా అన్నారు. దీనికితోడు శ్రుతికి ఆమె కుటుంబ సభ్యులు వేరే పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించడంతో మనస్తాపానికి గురయ్యారు.

ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లో కలుసుకున్న వినయ్, శ్రుతి అక్కడి నుంచి భువనగిరికి చేరుకున్నారు. అదే రోజు రాత్రి సుమారు 8 గంటల సమయంలో భువనగిరి శివారులోని అనంతారం రైల్వే వంతెన సమీపంలో సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళుతున్న రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

రైలు లోకోపైలట్‌ అందించిన సమాచారంతో రైల్వే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాల కోసం గాలించారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఛిద్రమైన వారి మృతదేహాలను గుర్తించారు. ఘటనా స్థలంలో పంచనామా నిర్వహించగా శ్రుతి హ్యాండ్‌బ్యాగ్‌లో ఆమె ఆధార్ కార్డు, పనిచేస్తున్న కంపెనీ గుర్తింపు కార్డు లభ్యమయ్యాయని పోలీసులు పేర్కొన్నారు. వారి సెల్‌ఫోన్లు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. లభించిన గుర్తింపు కార్డుల ఆధారంగా మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి జనరల్ ఆసుపత్రికి తరలించారు.

శ్రుతి తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు కాగా, పెద్ద కుమార్తెకు వివాహం జరిపించారు. సోమవారం పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం వినయ్, శ్రుతి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే జీఆర్పీ ఇన్‌ఛార్జి కృష్ణారావు వెల్లడించారు. ఈ ఘటన ఇరు గ్రామాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
Shruti
Shruti suicide
Vinay Kumar
inter caste marriage
Bhuvanagiri
love couple suicide
train accident
suicide case
Yadadri Bhuvanagiri district
Anantharam railway bridge

More Telugu News