PM Modi: జీ7 సదస్సు కోసం కెనడా చేరుకున్న ప్రధాని మోదీ

PM Narendra Modi Arrives in Canada for G7 Summit
  • కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు ఈ పర్యటన
  • కననాస్కిస్‌లో జరిగే సదస్సులో మంగళవారం మోదీ ప్రసంగించనున్నారు
  • పలు దేశాల అధినేతలతో భేటీ కానున్న మోదీ  
  • భారత్-కెనడా సంబంధాల పునరుద్ధరణపై ఆశలు
  • మోదీ రాకతో కెనడాలోని ప్రవాస భారతీయుల్లో నూతనోత్సాహం
ప్రధాని నరేంద్ర మోదీ కెనడా ప్రధాని మార్క్ కార్నీ ప్రత్యేక ఆహ్వానం మేరకు జీ7 సదస్సులో పాల్గొనేందుకు కెనడాలోని కాల్గరి నగరానికి చేరుకున్నారు. ఈ పర్యటన అంతర్జాతీయంగానే కాకుండా, భారత్-కెనడా ద్వైపాక్షిక సంబంధాల పరంగానూ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

కాల్గరి విమానాశ్రయంలో ప్రధాని మోదీకి భారత తాత్కాలిక హైకమిషనర్ చిన్మోయ్ నాయక్, కెనడా ప్రభుత్వ అధికారులు, కెనడా స్థానిక మూలవాసులైన "ఫస్ట్ నేషన్" ప్రతినిధులు సాదర స్వాగతం పలికారు. అనంతరం అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ జీ7 శిఖరాగ్ర సదస్సు జరిగే సుందరమైన రిసార్ట్ పట్టణం కననాస్కిస్‌కు ప్రధాని బయలుదేరి వెళ్లారు. ఈరోజు జరిగే సమావేశాల్లో ప్రధాని మోదీ ఇతర ఆహ్వానిత దేశాధినేతలతో కలిసి పాల్గొంటారు.

ఈ సదస్సులో భాగంగా ప్రధాని మోదీ జీ7 కూటమి సభ్య దేశాలైన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా, జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, అలాగే ఆతిథ్య దేశ ప్రధాని, జీ7 అధ్యక్షుడు మార్క్ కార్నీలతో చర్చలు జరపనున్నారు. అయితే, ఇరాన్-ఇజ్రాయెల్ సంక్షోభం కారణంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సదస్సు నుంచి త్వరగా వెనుదిరుగుతుండటంతో ఆయనతో భేటీకి అవకాశం లేకుండా పోయింది.

జీ7 సదస్సుకు ఆహ్వానితుల జాబితాలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ, మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా కూడా ఉన్నారు. 

భారత్-కెనడా సంబంధాల విషయంలో ఈ పర్యటన ఒక కీలకమైన తరుణంలో జరుగుతోంది. గత ప్రధాని జస్టిన్ ట్రూడో హయాంలో ఖలిస్థాన్ మద్దతుదారుల ప్రభావంతో దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను ప్రస్తుత ప్రధాని మార్క్ కార్నీ చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ సందర్భంగా కెనడియన్ హిందూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కుషాగ్ర శర్మ ఐఏఎన్ఎస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, "పీఎం మోదీ ఇక్కడికి రావడం ఇరు దేశాలు కలిసి పనిచేయాలనుకుంటున్నాయని సూచిస్తోంది. ఇది రెండు దేశాల ఆర్థిక పరిస్థితికి ఎంతో మేలు చేస్తుంది. ఇప్పటికే వాణిజ్యం జరుగుతోంది. అది మరింత వృద్ధి చెందుతుంది" అని అభిప్రాయపడ్డారు.

ఇక‌, ప్రధాని మోదీ పర్యటనతో కెనడాలోని ఇండో-కెనడియన్లలో తీవ్ర ఉత్సాహం నెలకొంది. కెనడాలో దాదాపు 18 లక్షల మంది ఇండో-కెనడియన్లు, 10 లక్షల మంది భారతీయ పౌరులతో కూడిన అతిపెద్ద ప్రవాస భారతీయ సమాజం నివసిస్తోంది. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
PM Modi
Narendra Modi
G7 Summit
Canada
Mark Carney
India Canada relations
Calgary
Justin Trudeau
Indo Canadian
Khalistan
Trade

More Telugu News