Rana Daggubati: ఎయిరిండియా విమాన ప్రమాదం: 'రానా నాయుడు 2' ఈవెంట్ రద్దు

Rana Daggubati Rana Naidu 2 event cancelled after Air India crash
  • ఎయిరిండియా విమాన ప్రమాదం నేపథ్యంలో పలు కార్యక్రమాలు రద్దు
  • 'రానా నాయుడు సీజన్ 2' ఫ్యాన్, మీడియా ఈవెంట్ రద్దు చేసిన నిర్వాహకులు
  • బాధిత కుటుంబాలకు సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన
అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం గురువారం నాడు టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘోర దుర్ఘటన నేపథ్యంలో, వినోద పరిశ్రమకు చెందిన పలు కార్యక్రమాలు రద్దు అయ్యాయి. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానున్న 'రానా నాయుడు సీజన్ 2' వెబ్ సిరీస్‌కు సంబంధించి నేడు జరగాల్సిన అభిమానులు, మీడియా సమావేశాన్ని నిర్వాహకులు రద్దు చేశారు.

ఈ మేరకు 'రానా నాయుడు సీజన్ 2' మేకర్స్ ఒక ప్రకటన విడుదల చేశారు. "ఎయిర్ ఇండియా విమాన ప్రమాద దుర్ఘటన వార్తల నేపథ్యంలో, బాధితుల కుటుంబాలకు సంఘీభావంగా, 'రానా నాయుడు సీజన్ 2' కోసం ఈరోజు (గురువారం) తలపెట్టిన అభిమానులు, మీడియా సమావేశాన్ని రద్దు చేయాలని నిర్ణయించుకున్నాం" అని వారు తెలిపారు. విమాన ప్రమాద బాధితులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

కాగా, వెంకటేశ్, రానా ప్రధాన పాత్రల్లో నటించిన 'రానా నాయుడు' సీజన్ 2 జూన్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. కరణ్ అన్షుమాన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను సుపర్ణ్ ఎస్. వర్మ, అభయ్ చోప్రా సంయుక్తంగా రూపొందించారు. సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ సంస్థలు దీనిని నిర్మించాయి. ఈ సిరీస్‌లో అర్జున్ రాంపాల్, సుర్వీన్ చావ్లా, కృతి కర్బందా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, డీనో మోరియా తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Rana Daggubati
Rana Naidu Season 2
Air India plane crash
Netflix series
Venkatesh Daggubati

More Telugu News