ఎయిరిండియా విమాన ప్రమాదం... మృతుల కుటుంబాలకు భారీ పరిహారం ప్రకటించిన టాటా గ్రూప్
- అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాద బాధితులకు టాటా గ్రూప్ అండ
- మృతి చెందిన ప్రతి ఒక్కరి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ప్రకటన
- క్షతగాత్రుల పూర్తి వైద్య ఖర్చులను తామే భరిస్తామని వెల్లడి
ఈ మేరకు టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ఓ ప్రకటన విడుదల చేశారు. "ఎయిరిండియా ప్రమాద ఘటన మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది. ఈ బాధను మాటల్లో చెప్పలేకపోతున్నాం. ప్రమాదంలో ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం" అని ఆయన అన్నారు.
"ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి వ్యక్తి కుటుంబానికి టాటా గ్రూప్ తరఫున రూ.1 కోటి అందజేస్తాం. గాయపడిన వారి వైద్య ఖర్చులను కూడా మేమే భరిస్తాం. వారి సంరక్షణ బాధ్యత కూడా మాదే. అంతేకాకుండా, బీజే మెడికల్ హాస్టల్ నిర్మాణానికి మా వంతుగా తోడ్పాటు అందిస్తాం" అని చంద్రశేఖరన్ తన ప్రకటనలో వివరించారు.