Shreyas Iyer: ఐపీఎల్ ఫైనల్లో పంజాబ్ కింగ్స్... కెప్టెన్ అయ్య‌ర్‌కు ఊహించ‌ని షాక్!

Shreyas Iyer Leads Punjab Kings to IPL Final Faces Fine
  • స్లో ఓవర్ రేట్ కారణంగా అయ్యర్‌కు రూ. 24 లక్షలు జ‌రిమానా
  • ఇదే కార‌ణంతో ఎంఐ సార‌థి హార్దిక్‌ కు రూ. 30 లక్షల ఫైన్‌
  • జూన్ 3న ఫైనల్లో బెంగళూరుతో తలపడనున్న‌ పంజాబ్
  • ఇప్ప‌టివ‌ర‌కూ ఐపీఎల్ టైటిల్ గెల‌వ‌ని ఇరుజ‌ట్లు  
  • దీంతో ఈసారి ఐపీఎల్‌లో రానున్న‌ కొత్త ఛాంపియన్
ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌) అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. నిన్న‌ జరిగిన హోరాహోరీ క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ (ఎంఐ)ను చిత్తు చేసి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగి అజేయ అర్ధశతకం (87)తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, ఈ విజయానందంలో ఉన్న కెప్టెన్ అయ్య‌ర్‌కు స్లో ఓవర్ రేట్ రూపంలో భారీ జరిమానా ప‌డింది. అటు ముంబ‌యి సార‌థి హార్దిక్ పాండ్య‌కు కూడా ఇదే కార‌ణంతో బీసీసీఐ ఫైన్ వేసింది. 

స్లో ఓవర్ రేట్.. ఇరుజ‌ట్ల కెప్టెన్ల‌కు భారీ జ‌రిమానా
ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించినప్పటికీ, స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు బీసీసీఐ రూ. 24 లక్షల జరిమానా వేసింది. అలాగే జట్టులోని మిగతా ఆటగాళ్లకు (ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా) రూ. 6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం (ఏది తక్కువైతే అది) కోత విధించింది. మరోవైపు, ఓటమిపాలైన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యకు కూడా ఇదే తప్పిదానికి రూ. 30 లక్షల భారీ జరిమానా పడింది. ఆ జట్టులోని మిగతా ఆటగాళ్లకు రూ. 12 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానాగా విధించినట్లు ఐపీఎల్ వర్గాలు తెలిపాయి.

ఫైనల్ పోరు.. ఈసారి కొత్త ఛాంపియన్
ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ 2014 తర్వాత తొలిసారి ఐపీఎల్ ఫైనల్‌కు అర్హ‌త సాధించింది. కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ 11 ఏళ్ల అభిమానుల నిరీక్ష‌ణ‌కు తెర‌దించాడు. రేపు (మంగళవారం) జరిగే టైటిల్ పోరులో నాలుగుసార్లు ఫైనలిస్ట్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో పంజాబ్ తలపడనుంది. దీంతో ఈ సీజన్ ద్వారా ఈసారి ఐపీఎల్‌కు కొత్త ఛాంపియన్ రావడం ఖాయమైంది. దీంతో అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది.
Shreyas Iyer
Punjab Kings
IPL 2025
Mumbai Indians
Hardik Pandya
Slow Over Rate
Royal Challengers Bangalore
RCB
IPL Final
Cricket

More Telugu News