Ukraine: రష్యాపై ఎన్నడూ లేనంత భీకర దాడులు చేసిన ఉక్రెయిన్... భారీ విధ్వంసం!

Ukraine Launches Massive Drone Attacks on Russia
  • రష్యాపై ఉక్రెయిన్ భారీ స్థాయిలో డ్రోన్ దాడులు
  • సైబీరియాతో పాటు అనేక రష్యా వైమానిక స్థావరాలే లక్ష్యం
  • 40కి పైగా రష్యా విమానాలు ధ్వంసమయ్యాయని ఉక్రెయిన్ మీడియా వెల్లడి
  • "స్పైడర్ వెబ్" పేరుతో రహస్యంగా దాడికి ప్రణాళిక
  • ఇస్తాంబుల్‌లో సోమవారం ఇరు దేశాల మధ్య కీలక చర్చలు
  • సైబీరియాలోని సైనిక స్థావరంపై దాడిని ధృవీకరించిన రష్యా
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నేడు రష్యాపై ఉక్రెయిన్ మునుపెన్నడూ లేనివిధంగా అత్యంత భారీ స్థాయిలో డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల తీవ్రత ఎంతగా ఉందంటే, ఉక్రెయిన్ సరిహద్దుకు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న తూర్పు సైబీరియాలోని కీలక వైమానిక స్థావరం కూడా దద్దరిల్లింది. ఇరు దేశాల మధ్య రేపు (జూన్ 2) ఇస్తాంబుల్‌లో కీలక శాంతి చర్చలు జరగనున్న తరుణంలో ఈ పరిణామం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.

'ఆపరేషన్ స్పైడర్ వెబ్' (పవుటినా) అనే సంకేతనామంతో ఉక్రెయిన్ భద్రతా విభాగం (ఎస్‌బీయూ) అత్యంత రహస్యంగా, ఏడాది పాటు ప్రణాళిక రచించి ఈ మెగా ఆపరేషన్‌ను అమలు చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో భాగంగా బెలాయా (తూర్పు సైబీరియా), ఫిన్‌లాండ్ సమీపంలోని ఆర్కిటిక్‌లోని ఒలెన్యా, మాస్కోకు సమీపంలో ఉన్న ఇవనోవో, డ్యాగిలెవో వంటి పలు కీలక రష్యా వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఉక్రెయిన్ వర్గాలు వెల్లడించాయి. ఈ దాడుల్లో సుమారు 40కి పైగా రష్యా విమానాలు ధ్వంసమయ్యాయని, వీటిలో అత్యాధునిక టీయూ-95, టీయూ-22ఎం3 బాంబర్లు, ఒక ఏ-50 నిఘా విమానం కూడా ఉన్నాయని ఉక్రెయిన్ మీడియా వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే, యుద్ధంలో ఉక్రెయిన్ జరిపిన అత్యంత విధ్వంసకర డ్రోన్ దాడిగా ఇది చరిత్రలో నిలిచిపోతుంది, మాస్కోకు ఇది గణనీయమైన ఎదురుదెబ్బ అవుతుందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

సైబీరియాలోని ఇర్కుట్స్క్ ప్రాంతంలోని స్రిద్ని గ్రామంలో తమ సైనిక స్థావరంపై డ్రోన్ దాడి జరిగిన విషయాన్ని ఆ ప్రాంత రష్యా గవర్నర్ స్వయంగా ధృవీకరించడం గమనార్హం. యుద్ధ క్షేత్రాలకు అత్యంత దూరంలో, రష్యా భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ శత్రువుల బాంబర్లను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఈ దాడి జరిగిందని తెలుస్తోంది. 

సరకు రవాణా ట్రక్కులపై అమర్చిన మొబైల్ చెక్క షెడ్లలో డ్రోన్‌లను దాచిపెట్టి, నిర్ణీత సమయాల్లో ట్రక్కుల పైకప్పులను రిమోట్‌గా తెరిచి, డ్రోన్‌లను ప్రయోగించినట్లు సమాచారం. రష్యా వద్ద ఉన్నంత విస్తృతమైన క్షిపణి నిల్వలు లేని ఉక్రెయిన్, వ్యూహాత్మకంగా డ్రోన్లనే ప్రధాన ఆయుధంగా మలుచుకుంటోంది.

ఇదిలా ఉండగా, రేపు ఇస్తాంబుల్‌లో ఇరు దేశాల మధ్య కీలక చర్చలు జరగాల్సి ఉంది. ఈ చర్చల్లో తమ ప్రతినిధి బృందం పాల్గొంటుందని, సంపూర్ణ కాల్పుల విరమణ, ఖైదీలు మరియు అపహరణకు గురైన పిల్లల విడుదల తమ ప్రధాన ప్రాధాన్యతలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. అయితే, ఈ పెను డ్రోన్ దాడుల నేపథ్యంలో ఇస్తాంబుల్ చర్చల భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ దాడులకు రష్యా ప్రతిస్పందన ఎలా ఉంటుందనేది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Ukraine
Russia Ukraine war
Ukraine drone attack
Volodymyr Zelensky
Russia
Istanbul peace talks
Operation Spider Web
Eastern Siberia
Russian airbases
Drones

More Telugu News