Donald Trump: సుంకాల విషయంలో అధ్యక్షుడు ట్రంప్‌కు భారీ ఎదురుదెబ్బ

Donald Trump Suffers Setback on Tariffs by US Trade Court
  • అధ్యక్షుడికి సుంకాలు విధించే అధికారాలు లేవ‌న్న ట్రేడ్ కోర్టు
  • అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఐఈఈపీఏ కింద అధ్యక్షుడికి ప్రపంచదేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించే అధికారం
  • విచారణ సమయంలో ‘భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల’ అంశాన్ని ప్రస్తావించిన ట్రంప్ ప్ర‌భుత్వం 
  • దాన్ని తోసిపుచ్చిన న్యాయ‌స్థానం
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన త‌ర్వాత‌ డొనాల్డ్‌ ట్రంప్ ప‌లు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ధానంగా ‘లిబరేషన్‌ డే’ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలపై భారీస్థాయిలో సుంకాలు విధించారు. అయితే, ఈ సుంకాల విషయంలో తాజాగా అధ్యక్షుడు ట్రంప్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్‌ టారిఫ్‌ల అమలుకు అమెరిక‌న్‌ ట్రేడ్‌ కోర్టు బ్రేకులు వేసింది. 

టారిఫ్‌లు విధించే అధికారాలు ట్రంప్‌కు లేవని స్ప‌ష్టం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం (IEEPA) కింద అధ్యక్షుడికి ప్రపంచదేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించే అధికారం ఉంటుందని ఈ సంద‌ర్భంగా ట్రేడ్‌ కోర్టు పేర్కొంది. ఇక‌, విచారణ సమయంలో ‘భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల’ అంశాన్ని ట్రంప్ ప్ర‌భుత్వం ప్రస్తావించింది. అయితే, న్యాయ‌స్థానం దాన్ని తోసిపుచ్చింది.

అధ్యక్షుడికి ఉన్న టారిఫ్‌ అధికారాలను సమర్థించాలని ట్రంప్ ప‌రిపాల‌న విభాగం కోర్టును అభ్యర్థించింది. టారిఫ్‌ అధికారం వల్లనే ఇటీవల భారత్‌-పాక్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని అధ్యక్షుడు ట్రంప్‌ సాధించగలిగార‌ని న్యాయ‌స్థానానికి తెలిపింది. 

ఈ ట్రేడ్‌ డీల్స్‌ను ఖరారు చేసుకునేందుకు జులై 7 వరకు గడువు ఉందని, అప్పటివరకు దీన్ని చాలా సున్నితమైన అంశంగా పరిగణించాలని కోర్టును కోరింది. సుంకాలకు సంబంధించి ప్రస్తుతం అనేక దేశాలతో చర్చలు జరుగుతున్నాయని ట్రంప్‌ సర్కారు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. అయితే, ట్రంప్‌ అడ్మిస్ట్రేషన్‌ చేసిన అన్ని వాదనలను ట్రేడ్‌ కోర్టు తిరస్కరించింది.

ట్రేడ్‌ కోర్టు ఏం చెప్పిందంటే..!
ట్రంప్‌ అడ్మిస్ట్రేషన్‌ అన్ని వాదనలను తోసిపుచ్చుతూ, మాన్‌హట్టన్‌కు చెందిన ముగ్గురు న్యాయమూర్తుల అంతర్జాతీయ వాణిజ్య న్యాయస్థానం, ఐఈఈపీఏ కింద అధ్యక్షుడికి అపరిమిత అధికారాలను కాంగ్రెస్ అప్పగించలేదని తీర్పు ఇచ్చింది. 

అసాధారణమైన ముప్పును ఎదుర్కోవడానికి అత్యవసర సమయంలో అవసరమైన ఆర్థిక ఆంక్షలు విధించడానికి మాత్రమే అధ్యక్షుడికి అధికారం ఉంటుంద‌ని ధర్మాసనం పేర్కొంది. 

అమెరికా ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి, అధ్యక్షుడి అత్యవసర అధికారాల ద్వారా అధిగమించబడని ఇతర దేశాలతో వాణిజ్యాన్ని నియంత్రించడానికి అమెరికా రాజ్యాంగం కాంగ్రెస్‌కు ప్రత్యేక అధికారాన్ని ఇస్తుందని కోర్టు తన తీర్పులో పేర్కొంది.
Donald Trump
Trump tariffs
US Trade Court
International Emergency Economic Powers Act
India Pakistan tensions
Trade deals
Tariff authority
US economy
Trade negotiations

More Telugu News