Shashi Tharoor: నాకు అంతకంటే ముఖ్యమైన పనులు ఉన్నాయి: కాంగ్రెస్ నేతలపై శశిథరూర్ ఆగ్రహం

- ఉగ్రవాదంపై మోదీ ప్రభుత్వ చర్యలను కొనియాడిన శశిథరూర్
- పనామాలో ప్రసంగిస్తూ సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ దాడుల ప్రస్తావన
- థరూర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేతల తీవ్ర అభ్యంతరం
- తనపై విమర్శలను తోసిపుచ్చిన థరూర్.. వారికి వేరే పనులు లేవంటూ చురక
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ మరోసారి సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఉగ్రవాదంపై నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన ప్రశంసించడమే ఇందుకు కారణం. తనపై వస్తున్న విమర్శలను, ట్రోల్స్‌ను పట్టించుకోనని, తనకు అంతకంటే ముఖ్యమైన పనులున్నాయని ఆయన బదులిచ్చారు.
పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ అనంతరం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రపంచస్థాయి ప్రచారంలో భాగంగా శశిథరూర్ భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. అమెరికా, పనామా పర్యటనల అనంతరం ఈ బృందం ప్రస్తుతం బొగోటాకు బయలుదేరింది.
బుధవారం పనామా నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో శశిథరూర్ మాట్లాడుతూ, ఇటీవలి కాలంలో భారత్‌ను లక్ష్యంగా చేసుకునే ఉగ్రవాదులకు తాము తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే విషయం అర్థమైందని అన్నారు. "యూరీ దాడుల అనంతరం తొలిసారిగా నియంత్రణ రేఖ దాటి సర్జికల్ స్ట్రైక్స్ చేశాం. పుల్వామా దాడి తర్వాత నియంత్రణ రేఖనే కాకుండా అంతర్జాతీయ సరిహద్దును కూడా దాటి బాలాకోట్‌లో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశాం. ఈసారి అంతకు మించి పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రాంతంలో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకున్నాం" అని థరూర్ వివరించారు.
థరూర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు. ఉదిత్ రాజ్ మాట్లాడుతూ, థరూర్ బీజేపీకి సూపర్ ప్రతినిధిగా మారి, మోదీ భజన చేస్తున్నారని ఆరోపించారు. పవన్ ఖేరా, జైరాం రమేశ్ కూడా థరూర్‌ను విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. యూపీఏ హయాంలోనూ అనేక సర్జికల్ దాడులు జరిగాయని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పిన వీడియోను ఖేరా ట్యాగ్ చేశారు.
ఈ విమర్శలపై శశిథరూర్ గురువారం 'ఎక్స్' వేదికగా స్పందించారు. "పనామాలో కార్యక్రమాలు ముగించుకుని, ఆరు గంటల్లో కొలంబియాలోని బొగోటాకు బయల్దేరాల్సి ఉంది. అయినా కొందరు నాపై నిందలు వేస్తున్నారు. నేను ఉగ్రవాద దాడులపై ప్రతీకార చర్యల గురించే స్పష్టంగా మాట్లాడాను తప్ప, గత యుద్ధాల గురించి కాదు. నా వ్యాఖ్యలను వక్రీకరించేవారికి, ట్రోల్ చేసేవారికి ఇదే నా సమాధానం. నాకు ఇంతకంటే ముఖ్యమైన పనులున్నాయి" అని పేర్కొన్నారు.