Telangana Rains: తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

Telangana Rains Yellow Alert Issued for Several Districts
  • పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం
  • గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు
  • గరిష్ఠ ఉష్ణోగ్రతలు 5 నుంచి 7 డిగ్రీలు తగ్గే అవకాశం
పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళవారం నుంచి గురువారం వరకు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ, కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు నమోదవుతాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం, మంగళవారం (మే 27) ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలతో పాటు రాజన్న సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు.

బుధవారం (మే 28) నాడు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జనగాం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. గురువారం (మే 29) నాడు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఈ మూడు రోజుల పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో పగటి ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా తగ్గుముఖం పట్టనున్నాయి. రానున్న మూడు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీల సెల్సియస్ వరకు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
Telangana Rains
Hyderabad Meteorological Center
Yellow Alert
Orange Alert
Heavy Rainfall

More Telugu News