Kodali Nani: కొడాలి నానిని చూసేందుకు ఎవరూ రావద్దు: నాని కుటుంబ సభ్యులు

Kodali Nani Family Asks Supporters Not to Visit Him in Hyderabad
  • శస్త్ర చికిత్స తర్వాత హైదరాబాద్ లోని నివాసంలో ఉంటున్న కొడాలి నాని
  • ఇటీవల ఓ వివాహ రిసెప్షన్ కు హాజరైన నాని
  • నాని కోలుకున్నారనే భావనతో ఆయనను కలిసేందుకు సిద్ధమవుతున్న వైసీపీ శ్రేణులు
మాజీ మంత్రి కొడాలి నానికి ఇటీవల శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని నివాసంలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో, ఆయనను పరామర్శించేందుకు గుడివాడ నియోజకవర్గం నుంచి గానీ, ఇతర ప్రాంతాల నుంచి గానీ అభిమానులు, వైసీపీ శ్రేణులు హైదరాబాద్ రావద్దని ఆయన కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వైసీపీ నేత దుక్కిపాటి శశిభూషణ్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

శస్త్రచికిత్స అనంతరం కొడాలి నానికి ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని, ఎక్కువ మంది వ్యక్తులను కలిస్తే ఆయన ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు సూచించినట్లు శశిభూషణ్ తెలిపారు. ముఖ్యంగా కొవిడ్ పరిస్థితులను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. 

ఇటీవల కొడాలి నాని తప్పనిసరి పరిస్థితుల్లో ఓ సన్నిహిత మిత్రుడి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యారని, ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన ఆరోగ్యం కుదుటపడిందని కొందరు భావిస్తున్నారని... ఈ క్రమంలోనే పలువురు ఆయనను పరామర్శించేందుకు హైదరాబాద్ వస్తున్నట్లు తెలిసిందని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది శ్రేయస్కరం కాదని అన్నారు.

మరో రెండు నెలల్లో కొడాలి నాని పూర్తి ఆరోగ్యంతో అందరికీ అందుబాటులోకి వస్తారని శశిభూషణ్ స్పష్టం చేశారు. అప్పటివరకు అందరూ సహకరించాలని కోరారు. కాగా, కొడాలి నాని తీవ్ర అనారోగ్యానికి గురై హైదరాబాద్‌లో ప్రాథమిక చికిత్స తీసుకున్న అనంతరం, మెరుగైన వైద్యం కోసం ముంబై వెళ్లిన విషయం తెలిసిందే. ముంబైలో ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించారు.
Kodali Nani
Gudivada
YS Jagan
YSR Congress Party
Health Update
Surgery Recovery
Hyderabad
Dukkipati Sashibhushan
Andhra Pradesh Politics
Covid Precautions

More Telugu News