Ramanjaneyulu: 16 ఏళ్ల బాలికను బలవంతంగా పెళ్లాడిన 60 ఏళ్ల వృద్ధుడు.. తప్పించుకున్న బాధితురాలు

Anantapur Girl Escapes Forced Marriage to 60 Year Old Man
  • అనంతపురం జిల్లాలో బాలికకు బలవంతపు వివాహం
  • కుటుంబ సభ్యులపై దాడి చేసి బాలికను ఎత్తుకెళ్లిన వృద్ధుడు
  • రెండు రోజులు నిర్బంధించి తీవ్రంగా కొట్టిన వైనం
  • ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేసిన బాలిక
అనంతపురం జిల్లాలో జరిగిన దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. పదహారేళ్ల బాలికను అరవై ఏళ్ల వృద్ధుడు బలవంతంగా వివాహం చేసుకున్నాడు. అతడి చెర నుంచి తప్పించుకున్న బాలిక ధైర్యంగా పోలీసులను ఆశ్రయించి తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసింది. ఈ అమానుష ఘటన రాయదుర్గం నియోజకవర్గంలో చోటుచేసుకుంది.

బాధిత బాలిక కుటుంబం రోజువారీ కూలి పనులపై ఆధారపడి జీవిస్తోంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు వివాహం కాగా, భర్త మరణించడంతో పుట్టింటిలోనే ఉంటోంది. రెండో కుమార్తె మైనర్‌ (16). ఆ కుటుంబ ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకున్న గుమ్మఘట్ట మండలం, పూలకుంట గ్రామానికి చెందిన రామాంజనేయులు (60) ఈ దారుణానికి ఒడిగట్టాడు. అతడి భార్య రెండేళ్ల క్రితమే మరణించింది. అతడికి వివాహమైన కుమారుడు, పెళ్లికి సిద్ధంగా ఉన్న కుమార్తె ఉన్నారు.

గత నెలలో బాలిక ఇంటికి వెళ్లిన రామాంజనేయులు ఆమెను తనకిచ్చి పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులను అడిగాడు. అందుకు వారు నిరాకరించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన రామాంజనేయులు వారిని బెదిరించి ఇంటి బయటే బాలిక మెడలో బలవంతంగా తాళి కట్టాడు. మరుసటి రోజు బాలికను ఇంటికి తీసుకెళ్లి కాపురానికి ఒత్తిడి చేశాడు.

ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టంలేని ఆ బాలిక వారం తిరిగేలోపే పుట్టింటికి తిరిగి వచ్చేసింది. దీంతో మరింత రెచ్చిపోయిన రామాంజనేయులు ఈ నెల 24న బంధువులతో కలిసి బాలిక ఇంటిపై దాడి చేశాడు. బాలిక తల్లి, తండ్రి, అక్కను చితకబాది బాలికను బలవంతంగా ఒక వాహనంలో తీసుకెళ్లాడు. అనంతరం రెండు రోజుల పాటు ఆ బాలికను ఒకచోట నిర్బంధించి, తీవ్రంగా కొట్టాడు.

ఆదివారం రాత్రి ఎలాగోలా ఆ వృద్ధుడి చెర నుంచి తప్పించుకున్న బాధిత బాలిక అర్ధరాత్రి సమయంలో ఒంటరిగా పొలాల గుండా నడుచుకుంటూ వచ్చి దారిలో ఒకచోట సేదతీరింది. సోమవారం ఉదయం, స్థానికుల సహాయంతో అనంతపురం ఎస్పీ కార్యాలయానికి చేరుకుంది. అక్కడ, తనకు జరిగిన ఘోరంపై అధికారులకు ఫిర్యాదు చేసింది. బాలిక చెప్పిన వివరాలు విన్న అధికారులు, వెంటనే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Ramanjaneyulu
Anantapur
minor girl marriage
forced marriage
child marriage Andhra Pradesh
Rayadurgam
crime news
Andhra Pradesh police
sexual assault
Gummighatta

More Telugu News